FASTag Changed to GNSS :ఫాస్ట్‌ట్యాగ్ అంటే తెలియని వాహనదారులు ఉండరు. హైవేలపై ప్రయాణించే వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేయడంతో దేశ వ్యాప్తంగా టోల్ వసూలు వ్యవస్థ విప్లవాత్మకంగా మారింది. ఇది చాలా ఆధునిక పద్ధతి అయినప్పటికీ త్వరలో కనుమరుగయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. కేంద్ర ప్రభుత్వం మరింత అధునాతన టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త విధానంలో భాగంగా ప్రస్తుత వ్యవస్థలోని లోటుపాట్లన్నీ తొలగిపోయి మరింత పారదర్శక వ్యవస్థ అమలుకు అవకాశాలున్నాయి.
టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రోజూరోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. వాహనాలు టోల్ బూత్‌ల మీదుగా వెళుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా టోల్ చార్జి డిజిటల్ వాలెట్ నుంచి కట్ అవుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ నగదు రహిత లావాదేవీని ప్రోత్సహించడంతో పాటు పొడవైన వాహనాల క్యూలైన్లను తగ్గించింది. టోల్ వసూళ్లలో విశేష జనాదరణ పొందినా కొన్ని లోపాలు వాహనదారులను అసంతృప్తికి గురిచేస్తున్నాయి.
తక్కువ దూరం ప్రయాణించినా ఎక్కువ చార్జీతో పాటు పలు సందర్భాల్లో కోడ్ స్కాన్ కాకపోవడం వల్ల క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త ఆవిష్కరణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ కొత్త టెక్నాలజీని గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS -Global Navigation Satellite System)గా పిలుస్తున్నారు.
ప్రస్తుతం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ కేంద్రాల ద్వారా ఏటా 40వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. జీఎన్ఎస్ఎస్ అమలుతో వచ్చే రెండు మూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణ మరింత మెరుగుపర్చేలా ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
FASTag విధానంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారనే వాదన ఉంది. ప్రయాణించిన దూరాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా టోల్ వసూలు చేస్తున్నారనేది వారి ఆవేదన. అయితే, కొత్త టెక్నాలజీ GNSS వారికి ఎంతో ఉపశమనాన్ని కల్పిస్తుంది. టోల్ రోడ్డుపై వాహనం ప్రయాణించే ఖచ్చితమైన దూరం ఆధారంగా టోల్ లెక్కిస్తుంది. ఉపగ్రహ సమాచారం వినియోగించుకుని ఈ వ్యవస్థ పనిచేస్తుంది. హైవేలో ప్రయాణం ప్రారంభించిన స్థానం మొదలుకుని నిష్క్రమించే వరకూ లెక్కించి టోల్ తీసుకుంటుంది.
GNSS ప్రయోజనాలు
ఉపగ్రహ సాంకేతికత, వాహనాలలో అమర్చిన ఆన్‌బోర్డ్ యూనిట్లను అనుసంధానం చేయడం ద్వారా GNSS వ్యవస్థ పనిచేస్తుంది. టోల్ రహదారిలోకి ప్రవేశించినప్పుడు ఉపగ్రహం ద్వారా ప్రయాణాన్ని ట్రాక్ చేస్తుంది. రహదారి పరిధి నుంచి వెళ్లిపోయిన తర్వాత మొత్తం దూరం ఆధారంగా చార్జీని లెక్కిస్తుంది. జీఎన్ఎస్ఎస్ టోల్ వసూలు పద్ధతి ఇప్పటికే అనేక యూరోపియన్ దేశాల్లో అమలు చేస్తున్నారు.
GNSS వినియోగం వల్ల వినియోగదారులతో పాటు ప్రభుత్వానికి బహుళ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. టోల్ ప్లాజాల ఏర్పాటును నియంత్రించడంతో పాటు క్యూలైన్లలే వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. పైగా టోల్ ఛార్జీలు ప్రయాణించిన వాస్తవ దూరం ఆధారంగా ఉంటాయి కాబట్టి ఇకపై తక్కువ దూరానికి ఎక్కువ చార్జీ చెల్లించాల్సిన పని లేదు. ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ టోల్ ఎగవేత అవకాశాలను తగ్గించడంతో పాటు ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
FASTag నుంచి GNSS విధానానికి మారిపోవడం ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. FASTag సాంకేతికతతో GNSSని అనుసంధానించే హైబ్రిడ్ మోడల్‌తో ప్రారంభమవుతుంది. ప్రారంభంలో ఎంచుకున్న టోల్ ప్లాజాల వద్ద కొన్ని లేన్‌లు మాత్రమే GNSSగా మార్చుతారు. కేంద్రం ఇప్పటికే రెండు ప్రధాన జాతీయ రహదారులపై GNSS పరీక్షను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. వీటిలో కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ జాతీయ రహదారి (NH-275), హర్యానాలోని పానిపట్-హిసార్ జాతీయ రహదారి (NH-709) ఉన్నాయి.