Central Actions on Financial Union Funds Diversion : పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధులను ఏపీ ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోకుండా కేంద్రం చెక్ పెట్టింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించింది. వాటిలో నిధులు జమ చేసి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్‌కు మ్యాపింగ్ చేయిస్తోంది. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు లోబడి చేయించే పనులకు బ్యాంకు ఖాతాల్లోని నిధులను ఇకపై పట్టణ స్థానిక సంస్థలే నేరుగా వినియోగించుకునేలా చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఎఫ్ఎమ్ఎస్(CFMS)కి బిల్లులు అప్‌లోడ్ చేయడం, ఎప్పుడు నిధులిస్తే అప్పుడే పట్టణ స్థానిక సంస్థలు తీసుకోవడం వంటి నిరంకుశ విధానానికి చెల్లుచీటీ పాడుతోంది. రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఏటా దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తోంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటోంది.
సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ నియంత్రణలోని పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోనే ఆర్థిక సంఘం నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఖాతాల్లో నిధులున్నట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నా పూర్తి చేసిన పనులకు ఆర్థిక శాఖ నిధులు వెంటనే విడుదల చేయదు. నిధులు అందుబాటులో ఉన్నప్పుడే స్థానిక సంస్థలకు విదిలిస్తోంది. దీంతో ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి ఎప్పుడూ 150 కోట్ల నుంచి 200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి.