Cambodia Jobs Scam Latest News : భారత్‌కు చెందిన నిరుద్యోగ యువతను ఉద్యోగం పేరుతో కాంబోడియా దేశం పంపించి మోసాలు చేస్తున్న కీలక నిందితుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలో షాదాబ్ అలాంను అరెస్టు చేసిన పోలీసులు నగరానికి తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. సిరిసిల్లకు చెందిన బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.
గతంలో ఏజెంట్ సాయి ప్రసాద్, దిల్లీకి చెందిన మరో ఏజెంట్ అన్సారినీ సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో దుబాయిలో ఉంటూ చైనీయులకు సహకరిస్తున్న షాదాబ్‌ను దిల్లీకి వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. దుబాయిలో ఉంటున్న షాదాబ్ కంబోడియా దేశంలో చైనీయుల కోసం పని చేస్తున్న దీపు అనే వ్యక్తికి ఏజెంట్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చాలా మంది యువతను ఇలానే మోసం చేసి కాంబోడియా పంపినట్లు తెలుసుకున్నారు. కాగా మే 16న సిరిసిల్ల పీఎస్‌లో నమోదైన కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి బదిలీ అయింది.
Cambodia Job Frauds In Telangana: రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా వెనుగుమట్లకు చెందిన యువకుడు ఉపాధి నిమిత్తం కోరుట్లకు చెందిన వంశీకృష్ణ అనే ఏజెంట్‌ను సంప్రదించగా ఆయన అజర్బైజాన్లో కూలి పని ఇప్పిస్తానని చెప్పాడు. 2022 సెప్టెంబరులో బాధితుడు నుంచి వంశీకృష్ణ రూ.15 వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ ఏడాది డిసెంబరులో రూ.2 లక్షలు చెల్లించిన పని కాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు ఒత్తిడి తీసుకువచ్చాడు.