Heavy Rush At Bus stations : ఓటు వేసేందుకు హైదరాబాద్లో నివసిస్తున్న తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూరు బాటపడుతున్నారు. ఉద్యోగులకు శని,ఆదివారాలు సెలవులు. సోమవారం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఈసీ ఆదేశాలతో చాలా సంస్థలు సెలవు ప్రకటించాయి. ఫలితంగా 13న జరిగే పోలింగ్ కోసం భారీగా సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.
ఆర్టీసీ, దక్షిణమధ్య రైల్వే అదనపు సేవలు సమకూర్చినా రద్దీకి తగినట్లుగా సరిపోవడం లేదు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్ సంస్థల నిర్వాహకులు ఛార్జీలు భారీగా పెంచేశారు. మామూలు రోజుల కన్నా రెట్టింపు పిండేస్తున్నారని జనం వాపోతున్నారు.
బస్టాండ్ల వద్ద విపరీతమైన రద్దీ :హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, ఉప్పల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మియాపూర్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్లు సైతం ఓటు కోసం స్వస్థలాలకు వెళ్లే వారితో కిక్కిరిసిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్ సందడిగా మారింది. ఏ బస్సు చూసినా సీట్లన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పంచామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
"ఓటేసేందుకు కర్నూలుకు వెళ్తున్నాను. మాములుగా టికెట్ ధరలు రూ.300-400 ఉండేది. ఇప్పుడు ఒకేసారి ప్రైవేటు ట్రావెల్స్ వారు రూ.800 లు డిమాండ్ చేస్తున్నారు. అధిక ధరలు అడుగుతున్నారు. మేము కేవలం ఓటు వేసేందుకే ఇంటికి వెళ్తున్నాం. సరిపడినన్ని బస్సులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు చొరవ చూపించి మరిన్ని బస్సులు పెంచాలి" - ప్రయాణీకులు