KTR SATIRICAL COUNTERS TO SEETHAKKA : మహిళలతోపాటు అన్నివర్గాలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మహిళలకు ఉచితబస్సుల ప్రయాణంపై కేటీఆర్, తనదైన శైలిలో వ్యంగస్త్రాలు సంధించారు. బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై, కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు తాము వద్దనట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకోవచ్చని ఆయన తెలిపారు. బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారని, డ్రైవర్లు కండక్టర్లకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. బస్సులు ఎక్కువ పెట్టండి, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టండంటూ ప్రభుత్వంనుద్దేశించి వ్యాఖ్యనించారు.
"బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు మేము వద్దనట్లేదు. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకోవచ్చు. బస్సుల్లో సీట్లకోసం మహిళలు కొట్టుకుంటున్నారు. డ్రైవర్లు కండక్టర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టండి". - కేటీఆర్, మాజీమంత్రి
కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్ :మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పంచాయత్‌రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క స్పందించారు. తెలంగాణ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ, కేటీఆర్ అత్యంత జుగుస్పాకరంగా మాట్లాడారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.