KTR Accused as A1 in Formula E car Racing Case :ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ఏసీబీ విచారణ మొదలైంది. రేసింగ్‌లో అవకతవకలపై కేసు నమోదు చేసింది. ఇందులో ఏ1గా అప్పటి మున్సిపల్ శాఖా మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. త్వరలోనే ఈ కేసు విచారణ నిమిత్తం ఏసీబీ వీరికి నోటీసులు జారీ చేసే అవకాశముంది.
ఆర్బీఐ అనుమతి లేకుండానే చెల్లింపులు : ఈ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేశారు. గవర్నర్ అనుమతితో సర్కారు తదుపరి చర్యలకు ఉపక్రమించింది. సోమవారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం మేరకు ఈ-కార్ రేసింగ్‌పై విచారణ చేపట్టాలని ఏసీబీకి మంగళవారం సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. ఈ-కార్ రేసింగ్‌లో వివాదాస్పదంగా మారిన విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ప్రధానంగా దర్యాప్తు జరగనుంది. హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయి. వీటిలోనూ రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ఏసీబీ దర్యాప్తు చేయనుంది.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై 2022 అక్టోబరు 25న కుదిరిన ఒప్పందం కుదిరింది. ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్ట్స్ జెన్, పురపాలక శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు హైదరాబాద్‌లో నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్‌లో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు.