తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు - కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు సోమవారానికి వాయిదా - KAVITHA BAIL PETITION NEWS LATEST - KAVITHA BAIL PETITION NEWS LATEST

BRS MLC Kavitha Bail Petition Updates : ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వేసిన పిటిషన్లపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సమయాభావం కారణంగా న్యాయస్థానం తదుపరి వాదనలను సోమవారానికి వాయిదా వేసింది.

MLC Kavitha
MLC Kavitha (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 1:59 PM IST

Updated : May 25, 2024, 11:58 AM IST

Kavitha Bail Petition Updates :దిల్లీ లిక్కర్ విధానం రూపకల్పనలో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీలు నమోదుచేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ సోమవారానికి (27వ తేదీకి) వాయిదా పడింది. శుక్రవారం ఈ కేసులపై విచారణ జరిపిన జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం సమయాభావం కారణంగా వాదనలను సోమవారానికి వాయిదా వేసింది.

Delhi Liquor Scam Case Updates : శుక్రవారం విచారణ సందర్భంగా కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌధరి వాదనలు వినిపిస్తూ ఆమె అరెస్ట్ విషయంలో దర్యాప్తు సంస్థలు రెండూ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు. ఈ అంశాన్ని సవాల్‌చేస్తూ ఆర్టికల్‌ 32 కింద తాము సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశామని, ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీచేసి విచారణను జులైకి వాయిదా వేసిందని గుర్తుచేశారు.

సుప్రీంకోర్టు చెప్పిన మీదట బెయిల్‌ కోసం తాము పిటిషన్లు దాఖలు చేసినట్లు విక్రమ్ చౌధరి హైకోర్టు దృష్టికి తెచ్చారు. 2022 ఆగస్ట్ 17న సీబీఐ కేసు నమోదు చేసినప్పుడుకానీ, అదే నెల 22న ఈడీ కేసు నమోదుచేసినప్పుడుకానీ కవితను నిందితురాలుగాకానీ, అనుమానితురాలుగాకానీ పేర్కొనలేదని గుర్తుచేశారు. అయితే, ఇండోస్పిరిట్‌ సంస్థలో వాటా కోసం డబ్బు సమకూర్చాలని కవిత చెప్పడంతో శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు కోటి రూపాయలు ఇచ్చినట్లు అరుణ్‌పిళ్లై వాంగ్మూలం ఇచ్చారని, దాని ఆధారంగానే ఆమె పేరు తెరమీదికొచ్చినట్లు న్యాయస్థానానికి వివరించారు. ఆ తర్వాత అరుణ్‌పిళ్లై ఆ వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

కవిత అరెస్ట్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు విక్రమ్ చౌధరి తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం విచారణ కోసం మహిళలను దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు పిలవకూడదని, ఆ విషయాన్ని తాము గుర్తుచేసినా వినకుండా దిల్లీలోని కార్యాలయానికి పిలిపించి విచారించారని న్యాయస్థానానికి వివరించారు. అయితే, కవిత తరఫు న్యాయవాది వాదనలు కొనసాగించడానికి కోర్టు సమయం లేకపోవడంతో న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ విచారణను సోమవారానికి వాయిదావేశారు.

ఇదే కేసులో జూన్‌ 7వ తేదీకల్లా కవిత పాత్రపై ఛార్జిషీట్‌ దాఖలుచేయనున్నట్లు సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. అలాగే బెయిల్‌ కోసం ఆమె దాఖలుచేసిన పిటిషన్‌పై తమ సమాధానాన్ని సోమవారానికల్లా దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్‌ కోసం కవిత దాఖలుచేసిన పిటిషన్లపై సోమ, మంగళవారాల్లో వాదనలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత న్యాయమూర్తి తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

దిల్లీ లిక్కర్ స్కామ్ అప్డేట్ - ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ - SPECIAL COURT DENIES KAVITHA BAIL

దిల్లీ మద్యం కుంభకోణం కేసు - ఈడీ అనుబంధ ఛార్జిషీట్​పై 29న ఉత్తర్వులు - Delhi Liquor Scam Case Updates

Last Updated : May 25, 2024, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details