BRS MLAs Disqualification Petition : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు ఆదేశాలిచ్చే పరిధి ఈ కోర్టుకు లేదంటూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసమం చెప్పిందని తెలిపింది.
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్‌రావులపై అనర్హతా వేటు వేయాలంటూ గులాబీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ వేర్వేరు పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బీ విజయ్‌సేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ స్పీకర్‌కు ఆదేశాలిచ్చే పరిధి హైకోర్టుకు లేదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు.
గత తీర్పు పరిశీలనలు : పిటిషనర్లు కేశం మెగాచంద్రసింగ్ కేసులో ముగ్గురు జడ్జీలు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకొని వాదనలు వినిపిస్తున్నానన్నారు. అయితే అయిదుగురు జడ్జీలు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించారంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ జాప్యం చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందన్నారు.