BRS MLA Padi Kaushik Reels In Yadadri Temple: తెలంగాణ రాష్ట్రంలో వివాదాలు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. గతంలో అరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కొంచెం చక్కబడినట్టు కనిపించగా, తాజాగా పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కౌశిక్ రెడ్డి తన సతీమణి, కుమార్తెతో కలిసి రీల్స్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం వివాదానికి దారి తీసింది. యాదాద్రి క్షేత్రంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. దీంట్లో తన సతీమణి శాలిని పుట్టిన రోజు సందర్భంగా పోస్టు చేసిన వీడియో వివాదానికి తెరతీసింది. ఆ వీడియోలో తన సతీమణి శాలినితో కలిసి యాదాద్రి ఆలయంలో తిరుగుతున్నారు. అంతేకాకుండా అక్టోబర్ 3వ తేదీన తన కుమార్తె శ్రీనిక జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కూడా యాదాద్రి క్షేత్రం వద్ద తీసినవే.
ఆలయ మాఢ వీధుల్లో తిరుగుతూ తన కుమార్తె శ్రీనికతో కౌశిక్ రెడ్డి రీల్స్ చేయించారు. ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుత పదవిలో ఉన్న కౌశిక్ రెడ్డి, ఆలయ క్షేత్రంలో ఇలా రీల్స్ చేయడం సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూస్తే కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్ కోసమే ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. వాళ్లు రీల్స్ చేసేటప్పుడు భక్తులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం.