BRS MLA Kotha Prabhakar Reddy Fires on Telangana Govt : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్న ఎమ్మెల్యేగా తనకు ఇంకా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శాసనసభలో పద్దులపై చర్చలో భాగంగా ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అంటూ గతంలో కాంగ్రెస్ నేతలు బద్నాం చేశారని, అయితే ఇప్పుడు మధిర, కొడంగల్ నియోజకవర్గాలకు నిధులను తరలిస్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో ఆరోపించారు. అందుకే మీకు(అధికారపక్షానికి) ప్రశ్నించే హక్కులేదని పేర్కొన్నారు.
అప్పుడు అలా చేశామనే మమ్మల్లి(బీఆర్ఎస్ పార్టీ) ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, మరి మీరు కూడా ఇక్కడ కూర్చుంటారా అంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఏదైనా శాఖకు ప్రతి ఏటా బడ్జెట్ పెరుగుతుంది కానీ తగ్గడం ఏంటని ప్రశ్నించారు. నిధులు లేక గ్రామాలు ఏడుస్తున్నాయని ఆవేదన చెందారు. కుక్కలు, పందులు బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వివరించారు. కానీ బీఆర్ఎస్ పాలనలో గ్రామీణాభివృద్ధి బాగా జరిగిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
"2014 నుంచి తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థ మీద నాటి సీఎం కేసీఆర్ మూడేళ్లలో అభివృద్ధి చేసిన ఘనత అప్పటి కేసీఆర్‌ది. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల జిల్లాలకు నాటి అభివృద్ధి అంటున్నారు కదా ఇప్పుడు మధిర, కొడంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నిధులు అన్నీ వెళుతున్నాయి. అప్పుడు అలా చేయడం వల్లే ఈనాడు ఇక్కడ కూర్చున్నాం."- కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
మీ పాలనలో సర్పంచ్‌లు అప్పులు పాలు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇస్తూ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో సర్పంచులు అప్పుల పాలైయ్యారని, ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. లక్షల కోట్ల రూపాయల నిధులు, బకాయిలు గత ప్రభుత్వం గ్రామాలకు పెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పుడు తాము మోస్తున్నామని పేర్కొన్నారు.