BRS MLA Jagadish Reddy On Sita Rama Project : కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం అనుకుంటే అంతకన్నా బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. వీధుల్లో కుక్కలు ప్రజలను కరుస్తుంటే కనకపు సింహాసనం మీద కూర్చున్న శునకాలు ప్రతిపక్షాలను కరుస్తున్నాయని వ్యాఖ్యానించారు. సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్ రావు ఉన్న మాట అంటే మంత్రులకు ఉలుకు ఎందుకని ప్రశ్నించిన ఆయన ఓ మంత్రి కంటతడి పెట్టడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తిచేసారని కనీసం బటన్ నొక్కేటపుడైనా కేసీఆర్ కష్టం గురించి చెప్పాలని మంత్రులను కోరారు. మంత్రి ఉత్తమ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని కనీసం అధికారులతో ఆయన మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి 2022 దాకా వరుసగా కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే అనుమతులు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టుపై కనీసం ఒక ఉత్తరమైనా రాశారా అని ప్రశ్నించారు.
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత తప్పటడుగు వేసి బీఆర్ఎస్ ఒత్తిడితో వెనక్కి తగ్గారని కాంగ్రెస్ హయాంలోలాగా కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు అంచనాలు పది, పదిహేను రెట్లు పెంచలేదని పేర్కొన్నారు. కమీషన్లు ఇవ్వడం, తీసుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటన్న మాజీ మంత్రి కాలువలు తవ్వకముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేతలు ఇంకా చంద్రబాబు, వైఎస్ భజన చేస్తున్నారని వాళ్లిద్దరూ తెలంగాణలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో ఆంధ్రా, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్లో పడ్డాయని అన్నారు. వైఎస్ రాయలసీమకు 350 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశారని తెలంగాణకు ఏం చేశారని అడిగారు. వైఎస్, చంద్రబాబు హయాంలో తెలంగాణలో మూడున్నర క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్న చెరువు అయినా కట్టారా అని ప్రశ్నించిన జగదీష్ రెడ్డి ఎవరి హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు పూరయ్యాయో ఉత్తమ్, భట్టి చర్చకు వస్తారా అని సవాల్ చేశారు.