BRS MLA Harish Rao On KCR Governance: కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగం లక్ష కోట్లకు పైగా సంక్షేమమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతన్నకు నేరుగా అందించిన ఆర్థికసాయం వివరాలను ఆయన ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. 69 లక్షల మంది రైతులకు రూ. 72,972 కోట్ల రూపాయలు రైతుబంధు చెల్లించడంతో పాటు లక్షా 11 వేల మందికి రూ. 6,488 కోట్ల రూపాయల రైతుబీమా సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. రెండు దఫాల్లో 29,144 కోట్ల రూపాయాలు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద 11.401 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. కేవలం ఈ పథకాల ద్వారానే రైతుకు అందిన ఆర్థిక సాయం 1,20,005 కోట్ల రూపాయాలన్న హరీశ్ రావు దేశ చరిత్రలోనే ఇది ఆల్ టైం రికార్డ్ అని తెలిపారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు : మరోవైపుప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వేతనాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలకు పరిష్కారం చూపాలని, ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.