BRS Leaders Meet Gowlidoddi Gurukul Students :కాంగ్రెస్‌కు రాజకీయ కక్ష సాధింపులు ఉంటే తమపై తీర్చుకోవాలని, విద్యార్థులపై కాదని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని దళిత విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో టెర్మినేట్ చేసిన పాత ఫ్యాకల్టీనే తిరిగి తీసుకోవాలనే విద్యార్థుల డిమాండ్‌కు బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు ఇవాళ గౌలిదొడ్డి గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, గువ్వల బాలరాజుతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దళిత విద్యార్థులు కోరుతున్న చిన్నచిన్న కోరికల్ని కూడా తీర్చలేని స్థాయిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. విద్యార్థులు చాలా పరిపక్వతతో మాట్లాడుతున్నారని వారి జ్ఞానాన్ని చూస్తే ముచ్చటేస్తోందని కొనియాడారు. ఇటువంటి విద్యార్థులకు కష్టం వచ్చిందని తెలిసి రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చామని, పాత ఫ్యాకల్టీని కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు.
'దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో ఇప్పటివరకు ఆహారం కోసమైనా, టీచర్ల కోసమైనా రోడ్లెక్కిన పరిస్థితి రాలేదు. బెస్ట్ స్కూల్ విద్యార్థులకు బెస్ట్ ఫ్యాకల్టీ కావాలనే కోచింగ్ సెంటర్లు పెట్టారు. ఎవరూ కూడా ఆధైర్య పడొద్దు. తప్పకుండా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం'- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత
పురుగుల అన్నం తినే దౌర్భాగ్యస్థితి వచ్చింది : మాజీ సీఎం కేసీఆర్ హయాంలో గురుకులాలకు ఏ ఒక్కరోజు చిన్న సమస్య రాలేదని, ఇప్పుడు గురుకులాల్లో పురుగుల అన్నం తినే దౌర్భాగ్యస్థితి వచ్చిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా పిల్లలు ధైర్యం కోల్పోకుండా ఉండాలని, అన్ని విషయాల్లో బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. కాగా పాత ఫాకల్టీనే కొనసాగిస్తామని సీఎస్ ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు తెలిపారు.
'దేశమే మనవైపు చూసే పరిస్థితి కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందన్నట్లు మీ భయంలో కనిపిస్తోంది ఆ మాటలు. నిజంగా ఇది చాలా బాధాకరం. ఉత్తమ ఫ్యాకల్టీని మార్చడం వల్లే ఈ సమస్య వచ్చింది'- కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి