Harish Rao Slams Congress Govt : కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందనడానికి బాసర ట్రిపుల్ ఐటీ ఉదంతం మరో నిదర్శనమని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని ఒకవైపు గురుకుల విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే, ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
పూర్తి స్థాయి వీసీ నియామకం, నిధుల గోల్ మాల్, మెస్ కాంట్రాక్టులలో పారదర్శకత, సిబ్బంది నియామకాలు, ఆరోగ్య సేవల మెరుగుదల, మౌలిక సదుపాయాల పెంపు, తదితర 17 డిమాండ్లతో విద్యార్థులు నాలుగు రోజులుగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆయన ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రచారం కోసం ట్రాక్టర్లో వెళ్లి, కళాశాల గోడ దూకి నానాయాగి చేశారని గుర్తు చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకం :కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని భ్రమింపజేశారని హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి అయి రేవంత్ రెడ్డి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు కానీ, విద్యార్థుల భవిష్యత్తును మాత్రం ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. గతంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీకి వెళ్లి సమస్యలు పరిష్కరించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేసిన కృషిని కూడా కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. అందువల్లే ఇవాళ సమస్యలు పేరుకుపోయాయని మాజీమంత్రి ఆరోపించారు.