BJP Focus On Local Body Elections In Telangana : రాష్ట్రాభివృద్ధికి పట్టుకొమ్మలే గ్రామాలు ఆ గ్రామాల్లో కాషాయజెండా ఎగరవేస్తే రాష్ట్ర పీఠాన్ని సునాయసంగా కైవసం చేసుకోవచ్చని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా బీజేపీ ఎనిమిది స్థానాలను సొంతం చేసుకుంది. అధికార పార్టీకి సమానంగా సీట్లు సాధించిన బీజేపీ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఊవ్విల్లారుతోంది. ఈ ఎన్నికల్లో అత్యధిక గ్రామ పంచాయతీలను తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో బీజేపీ బలహీనంగా ఉంది. దీనిని అధిగమించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకుని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సమాయత్తమవుతోంది.
తెలంగాణకు కేంద్ర నిధలు :కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా కేటాయింపులు చేసి తెలంగాణకు ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంతో బీజేపీయే కాంగ్రెస్‌కు విమర్శనాస్త్రం అందించినట్లయింది. ఈ అంశంపై శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ సంధిస్తూ వచ్చింది. తెలంగాణపై కాషాయ పార్టీకి సవతి తల్లి ప్రేమ అంటూ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందనే వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఫ్లెక్సీలు వేసింది. దీంతో ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎనిమిది సీట్లలో గెలిపించి తప్పు చేశామనే భావన కలిగేలా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా తీసుకెళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు అస్త్రాన్ని ప్రయోగించి సఫలీకృతమైంది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సందర్భంగా మరోసారి గాడిద గుడ్డు అంశాన్ని హస్తం పార్టీ తెరపైకి తీసుకొచ్చింది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా లబ్ధిపొందాలనే అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని రేపు నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో హార్‌ఘర్ తిరంగాతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యదిక సీట్లు గెలిచే విధంగా కార్యాచరణ రూపకల్పన చేయనన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.