తెలంగాణ

telangana

ETV Bharat / state

కస్టమర్ కేర్ నంబర్​ కోసం గూగుల్​లో సెర్చ్ చేస్తున్నారా? - ఐతే మీ ఖాతా ఖల్లాస్ - CUSTOMER CARE NUMBER FRAUDS

కస్టమర్ కేర్​కు ఫోన్​ చేస్తే ఖాతా ఖాళీ - అసలు వెబ్​సైట్​లా నకీలీ సైట్లు - మార్కెట్​లో సైబర్​ నేరగాళ్ల కొత్త తరహా మోసాలు

FAKE WEBSITES GOOGLE SEARCH ENGINE
CYBER CRIMES WITH FAKE WEBSITES (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 1:59 PM IST

Cyber Crimes With Google Fake Websites : ఎలక్ట్రానిక్‌ వస్తువు రిపేర్ కోసమని కంపెనీ కస్టమర్‌ కేర్‌ కోసం గూగుల్‌లో వెతకగానే ఓ నంబరు కనిపిస్తుంది. ఫోన్‌ చేశాక అవతలి వ్యక్తులు చెప్పినట్లు చేశామా ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. బ్యాంకు లావాదేవీపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేద్దామని ప్రయత్నిస్తే నకిలీ వెబ్‌సైట్‌ కనిపిస్తుంది. తనిఖీ చేసుకోకుండా వివరాలు నమోదు చేస్తే ఖాతా గుల్లయినట్టే. సైబర్‌ నేరస్థులు కేవలం ప్రజలనే కాదు గూగుల్‌ను ఏమార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు.

ఇదీ నేరగాళ్ల మంత్రం:గూగుల్, ఇతర సెర్చింజన్‌ ఏదైనా సమాచారం కోసం వెతికినప్పుడు ఎక్కువ మంది వీక్షించే వెబ్‌సైట్లు, సంబంధించిన ప్రకటనలు తెరపై కనిపిస్తాయి. వీటిని సైబర్‌ ముఠాలు అనుకులంగా మార్చుకుని వాటి స్థానంలో నకిలీ వెబ్‌సైట్లు కనిపించేలా చేస్తున్నారు. సంస్థ పేరులో ఏదో ఒక అక్షరం తేడాతో ఈ వెబ్‌సైట్‌ ఉంటుంది.

గూగుల్‌ అల్గారిథమ్‌ ప్రకారం అసలు వెబ్‌సైట్‌ కోసం వెతికినప్పుడు ఎక్కువ వీక్షణలుండే నకిలీ వెబ్‌సైటే ముందుగా కనిపిస్తుంది. ఎక్కువ మంది అసలు, నకిలీ వెబ్‌సైట్లకు తేడా గుర్తించకుండా అందులోని నకిలీ కస్టమర్‌ కేర్‌లకే ఫోన్‌ చేస్తున్నారు. కొందరు నేరుగా ఆయా కంపెనీల కస్టమర్‌ కేర్‌ నంబర్ల కోసం వెతుకుతారు. ఇలా వెతికినప్పుడు స్క్రీన్​పైన 90 శాతం నకిలీ కాల్‌సెంటర్ల నంబర్లు దర్శనమిస్తున్నాయి. ఈ కాల్స్‌ను స్వీకరించే నేరగాళ్లు నమ్మ బలికి వివరాలు సేకరించి డబ్బులు కొట్టేస్తున్నారు.

10 శాతం మోసాలివే:ప్రస్తుతం 185 రకాల సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి. ఇందులో క్రెడిట్, డెబిట్‌ కార్డు, కస్టమర్‌ కేర్, తక్కువ ధరకే విలువైన వస్తువులు లాంటి మోసాలు దాదాపు 10 శాతం వరకూ ఉంటున్నాయి. వెబ్‌సైట్లో అంతా సవ్యంగానే కనిపించినా వివరాలు జాగ్రత్తగా నమోదు చేయించి వేర్వేరు ఫీజుల పేర్లు చెప్పి డబ్బు వసూలు చేస్తారు. తక్కువ ధరకే వస్తువులంటూ ప్రకటనలో బోల్తా కొట్టించడం మరో మోసం.

మనం ఫర్నీచర్‌ కోసం వెతికినప్పుడు తెరపై రూ.2 వేలకే మంచి ఖరీదైన ఫర్నీచర్, రూ.10 వేలకే ఫ్రిజ్‌ వంటి ప్రకటనలు వస్తాయి. పొరపాటున వీటి మీద క్లిక్‌ చేస్తే నేరుగా నకిలీ వెబ్‌సైట్లోకి తీసుకెళ్తుంది. వస్తువు డెలివరీ చేయడానికి డబ్బు కట్టాలంటూ మోసగిస్తారు. నకిలీ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసినప్పుడు ముందస్తు డిపాజిట్‌ కట్టాలనో.. లేక లింకు పంపిస్తే దాన్ని క్లిక్‌ చేయాలని చెబుతారు. ఈ లింకు క్లిక్‌ చేస్తే ఎనీ డెస్క్‌ వంటి యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతాయి తర్వాత ఫోన్‌ మొత్తం నేరుగా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఆ వెంటనే డబ్బులు కొట్టేస్తున్నారు.

జీ-మెయిల్ యూజర్లకు అలెర్ట్- మీకు ఆ రిక్వెస్ట్‌ వచ్చిందా?- అయితే బీ కేర్​ ఫుల్..!​

ఆన్​లైన్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం - త్వరలో రంగంలోకి దిగనున్న సైబర్ కమాండోలు - Cyber Commandos Training

ABOUT THE AUTHOR

...view details