Battalion Police Protest in Rajanna Siricilla : 'ఒకే పోలీస్- ఒకే రాష్ట్రం' నినాదంతో బెటాలియన్ కానిస్టేబుళ్లు చేపట్టిన ఆందోళనలు ఆగడంలేదు. నాలుగైదు రోజులుగా నిరసనలు చేస్తున్న తోటి ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం సరికాదంటూ మరోమారు ఖాకీలు రోడెక్కారు. నిర్ణీత సమయం లేని విధుల వల్ల కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతున్నామంటూ ర్యాలీ నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కార్యాలయాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
ఏక్ స్టేట్- ఏక్ పోలీస్ అనే నినాదంతో కొద్ది రోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేస్తున్నారు. నిర్ణీత పరిధి లేని విధుల వల్ల కుటుంబంతో సమయం గడపలేకపోతున్నామని రోడెక్కి నిరసన తెలిపారు. సిరిసిల్ల పట్టణం సర్దాపూర్‌లోని 17వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. అనంతరం కమాండెంట్ శ్రీనివాసరావు ఛాంబర్ వద్ద బైఠాయించి కమాండెంట్ పాలన వద్దంటూ నినాదాలు చేశారు. మీడియాతో మాట్లాడినందుకు సస్పెండ్ చేసిన ఆరుగురు కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేదంటే, ఆందోళనలో పాల్గొన్న 200 మందిని సైతం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ నిరసన : వరంగల్ జిల్లా మామునూరులో టీజీఎస్పీ 4వ బెటాలియన్‌లోనూ కానిస్టేబుళ్లు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేశారని పలువురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదన్నారు. సస్పెన్షన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని మామునూరు 4వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. నల్గొండలోని అన్నెపర్తి 12 వ పటాలంలోనూ ఆరుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఖాకీలు ఆందోళన చేపట్టారు. బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి 7వ బెటాలియన్ కానిస్టేబుల్స్, డిప్యూటీ కమాండెంట్ ఎమ్‌వై సురేశ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.