CI Wife Reacts To Aswaraopeta SI Suicide Incident: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనలో సీఐ జితేందర్ రెడ్డితో పాటు నలుగురు కానిస్టేబుళ్లు కులం పేరుతో దూషించడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐ జితేందర్ భార్య శైలజ ఓ వీడియోను విడుదల చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను సీఐ జితేందర్‌రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నట్లు ఆమె వివరించారు. అటువంటి తన భర్త, శ్రీరాములును కులం పేరుతో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు రావటం బాధాకరమన్నారు.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఐ జితేందర్ రెడ్డి 2003-06 వరకు తనతో పాటు డిగ్రీ కలిసి చదువుకున్నాడని ఆమె వివరించారు. 2009లో ఎసైగా ఉద్యోగం సాధించిన తర్వాత పెద్దలను ఒప్పించి 2015 లో ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులతో పాటు కుల సంఘాలు వారు దీన్ని గమనించి పారదర్శకంగా విచారణ చేయాలని శైలజ కోరారు. ప్రస్తుతం తనకు 6 ఏళ్ల వయసున్న కుమారుడు, నాలుగేళ్ల వయసున్న కుమార్తె ఉన్నట్లు చెప్పారు. ఎస్సై శ్రీరాములు శ్రీను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని పేర్కొన్నారు.
గుండెపోటుతో ఎస్సై మేనత్త మృతి: శ్రీరాముల శ్రీనివాస్ మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సై కుటుంబానికి కోటి రూపాయలు తక్షణ పరిహారం అందించాలని కోరారు. ఎస్సై శ్రీనివాస్ మృతి రాష్ట్రంలో గాడిదప్పిన పాలనకు నిదర్శనమేనని ఆరోపించిన సుదర్శన్ బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా ఎస్సై శ్రీరాముల శ్రీను మరణ వార్త విన్న అతని మేనత్త రాజమ్మ(70) గుండెపోటుతో మరణించారు. దీంతో ఆ కుటుంబంలో మరింత విషాదం నెలకొంది.
అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్యాయత్నం - పలువురి పోలీసులపై కేసు నమోదు