Tribal Villages River Problems in Asifabad : రాష్ట్రంలోని మారుమూల గ్రామాల పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోంది. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో అయితే ఊహించడానికే ఆ పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటున్నాయి. అక్కడ చిన్న పనికి బయట ప్రపంచానికి వెళ్లాలన్నా వాగులు దాటాల్సిందే. ఆ వాగు పరిస్థితి ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎందుకంటే వర్షం పడకపోతే నీరు లేకుండా రాకపోకలకు అనువుగా ఉంటుంది. అదే చిన్నపాటి చినుకు పడినా వాగు ఉద్ధృతంగా ప్రవహించి అటువైపు వెళ్లడానికి భయంగా మారుతోంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని గ్రామాల్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తుంది.
ఈ మండలంలో చిన్నపాటి చినుకుపడినా ఆ గ్రామస్థులకు వంతెన కష్టాలు తప్పడం లేదు. గ్రామం నుంచి కెరమెరి మండల కేంద్రానికి రావాలన్నా, వాగు అవతల వైపు చేను పనులకు వెళ్లాలన్నా వాగు దాటాల్సిందే. ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటించడంతో కెరమెరి మండలంలోని లక్మాపూర్ గ్రామస్థులు వాగు మీదుగా మండల కేంద్రంలోని బ్యాంకు వద్దకు వెళ్లారు. ఉదయం వాగులో నీటి ప్రవాహం లేదు. సాయంత్రం ఇంటికి వెళ్లే క్రమంలో వర్షం కురవడంతో వాగు పొంగిపొర్లింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరంగా మహిళలు సైతం వాగు దాటి ఇంటికి వెళ్లారు.
అనార్పల్లి, గోర్యగూడ వాగులు పొంగిపొర్లడంతో అవతల వైపు ఉన్న కరంజివాడ, బొరిలాల్గూడ, జన్కపూర్లకు ఇదే దుస్థితి నెలకొంది. వచ్చే వర్షాకాలంలోపు నిర్మాణంలో ఉన్న వంతెనలు పూర్తి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాగును దాటే క్రమంలో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని వాపోయారు. ప్రాణాలు పోయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆందోళన చెందారు.