ArcelorMittal Steel Plant in Anakapalli :ఉమ్మడి విశాఖ జిల్లా మెడలో మరో మణిహారం చేరనుంది. దేశీయ ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్ జాయింట్ వెంచర్ కంపెనీ రెండు దశల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తోంది. మొదటి దశలో రూ.70,000ల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. రాష్ట్ర చరిత్రలోనే ఇది భారీ పెట్టుబడి అవుతుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.
జగన్ సర్కార్ విధ్వంసక పాలనతో గత ఐదేళ్లలో పెట్టుబడుల కోసం నిరీక్షణే మిగిలింది. రాష్ట్రం వైపు కన్నెత్తి చూసేందుకు పారిశ్రామికవేత్తలు హడలిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో వస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆర్సెలార్ మిట్టల్ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. పరిశ్రమ మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరికి పూర్తి చేసి ఉత్పత్తిలోకి తీసుకురానున్నట్లు అందులో పేర్కొంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు, అధికారుల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది.
73 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి : స్టీల్ ప్లాంట్‌తో పాటు క్యాప్టివ్ అవసరాల కోసం పోర్టు, రైల్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు ఇవ్వాలని ఆర్సెలార్ మిట్టల్ సంస్థ కోరింది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్లాంట్ నిర్మాణ సమయంలో మరో 25,000ల మందికి, తర్వాత కార్యకలాపాలు, నిర్వహణ కోసం సుమారు 20,000ల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని సంస్థ ప్రతిపాదించింది. దీంతోపాటు రెండో దశ ప్లాంట్ నిర్మాణ సమయంలో అంతే మొత్తం లేదా అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది.
అనకాపల్లి బల్క్‌డ్రగ్ పార్కు కోసం ప్రతిపాదించిన 2200 ఎకరాలను మొదటి దశ ప్లాంట్ నిర్మాణానికి వినియోగించుకునే అవకాశం ఉందని, దీనివల్ల భూసేకరణ పనుల జాప్యం లేకుండా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించడానికి అవకాశం ఉందని ఆర్సెలార్ మిట్టల్ పేర్కొంది. టౌన్‌షిప్ అభివృద్ధి కోసం మరో 440 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణానికి మొదటి దశ ప్లాంట్‌కు అనుకుని ఉన్న మరో 3800 ఎకరాలను కేటాయించాలని ప్రతిపాదించింది. ఒకేచోట 20 నుంచి 24 మిలియన్ మెట్రిక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యమున్న ఉక్కు కర్మాగారం దేశంలోనే మొదటిదవుతుందని తెలిపింది. క్యాప్టివ్ అవసరాల కోసం పోర్టు నిర్మాణానికి ప్లాంట్‌కు సమీపంలో 3000ల మీటర్ల పొడవున సముద్ర తీర ప్రాంతాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.