APAAR ID Card for Students: ఆధార్ తరహాలో విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం 'అపార్'కు రూపకల్పన చేసింది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ ఐడీ పేరిట కేంద్ర విద్యాశాఖ 12 అంకెలతో కూడిన కార్డును కేటాయిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల అకడమిక్ వివరాలతో పాటు వారి ధ్రువపత్రాలను డిజిటల్‌గా భద్రపరిచేలా ఈ ‘అపార్’ కార్డుకు రూపకల్పన చేసింది.
అపార్ డిజిటల్ కార్డులో ఉండే వివరాలు : ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR) దీనినే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ కార్డు అని కూడా పిలుస్తారు.
- పేరు
- పుట్టిన తేదీ
- జెండర్
- ఫొటో
- క్యూఆర్ కోడ్
- 12 అంకెల గుర్తింపు నంబరు
- విద్యార్థి మార్కులు
- గ్రేడు
- ఉపకార వేతన వివరాలు
- క్రీడల్లో సాధించిన విజయాలు
- వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలు
ఈ వివరాలు అన్నీ అపార్ డిజిటల్ కార్డులో భద్రంగా ఉంటాయి. స్కాన్ చేస్తే మొత్తం అన్నీ తెలుసుకునేలా అపార్ను రూపొందించారు. తొలుత 9-12 తరగతుల వారికి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. 9, 10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు జారీ చేసేందుకు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు.
ఆపార్‌తో తీరనున్న విద్యార్థుల కష్టాలు :ఏపీకి(పక్క రాష్ట్రాలకు) చెందిన విద్యార్థులు ఆయా జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో డిగ్రీ లేదా పీజీ కోర్సులో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడి విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు అందిస్తారు. దీంతో మిగతా వారు తమ సొంత రాష్ట్రాల్లో ఉపకార వేతనాలకు దరఖాస్తు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్నట్లు వివరాలు అందుకు సంబంధించి దస్త్రాలు సమర్పించాలని, రిజిస్ట్రార్ సంతకంతో ధ్రువీకరణ ఉంటేనే ఇస్తామని చెప్పారు.