AP Govt on Red Sandalwood Tender and Auction : శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అరుదైన వృక్షమే కాదు, సహజ సిద్ధమైన ఆదాయ వనరు కూడా. దేశ విదేశాల్లోనూ ఈ కలపకు ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. ఒకవైపు స్మగ్లర్లు ఎర్రచందనాన్ని దొంగచాటుగా అమ్ముకొని కోట్ల రూపాయలకు పడగలెత్తుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక విక్రయాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం లేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఎర్రచందనాన్ని మార్చడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు తిరుపతిలోని తిమ్మినాయుడుపాలెం సమీపంలో ప్రత్యేకంగా కేంద్రీయ ఎర్రచందనం గోదాములనే నిర్మించింది.
గోదాముల్లో వేల టన్నుల ఎర్ర చందనం నిల్వలు - త్వరలోనే వేలానికి - కాసులు కురిపించేనా? - AP GOVT ON RED SANDALWOOD AUCTION
ఎర్ర చందనం విక్రయాల్లో భాగంగా గ్లోబల్ టెండర్లకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు - వెయ్యి టన్నుల దుంగలకు వేలం నిర్వహించేందుకు ప్రయత్నాలు - గోదాముల్లో ఏడు వేల టన్నులకు పైగా నిల్వలు

Published : Dec 19, 2024, 12:44 PM IST
ప్రపంచంలో ఎక్కడైనా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలను ఈ గోదాములకు తీసుకువచ్చేలా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గోదాములలో దుంగలకు గ్రేడ్ల వారీగా విభజించి, భద్రపరిచింది. వీటికి భారీ డిమాండ్ ఉన్న జర్మనీ, జపాన్, చైనా తదితర దేశాలకు ఏపీ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్ చేయించింది. అక్కడి అవసరాలు తెలుసుకుని ఈ మేరకు గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. 2018 సెప్టెంబరులో అత్యధికంగా 5 వేల టన్నుల ఏ, బీ గ్రేడ్ల ఎర్రచందనాన్ని విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఆ తర్వాత 2020లో వైసీపీ ప్రభుత్వంలో 4 వేల 343 టన్నుల్లో 300 టన్నులు, తర్వాత మూడేళ్లల్లో మరో 450 టన్నులు మాత్రమే విక్రయించింది.
7 వేల టన్నులకుపైగా నిల్వలు : ప్రస్తుతం గోదాముల్లో బఫర్ స్టాక్‌తో కలిపి మొత్తం 7 వేల టన్నులకుపైగా నిల్వలు ఉన్నాయి. అయితే విక్రయాల్లో భాగంగా ఈసారి 20వ గ్లోబల్ టెండర్లకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే దాదాపు వెయ్యి టన్నుల దుంగలకు వేలం నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ధర నిర్ణయించేందుకు అక్టోబరులోనే పీసీసీఎఫ్ ఆర్కే సుమన్ నేతృత్వంలోని కమిటీ గోదాముల్లోని 50 లాట్లలో ఉన్న దుంగలను పరిశీలించింది. అనంతరం ఆ దుంగలను గ్రేడ్ల వారీగా విభజించి, వాటి రంగును నమోదు చేసుకుంది. ఏ గ్రేడ్ టన్ను ధర రూ.65 లక్షల నుంచి రూ.75 లక్షలు, బీ గ్రేడ్ రూ.36 లక్షలు, సీ గ్రేడు రూ.20 లక్షలు, ఎన్ గ్రేడు రూ.7 లక్షలు, పొడి, పేళ్లు, వేర్లు టన్నుకు రూ.60 వేలుగా ధరలు నిర్ణయించారు. ఇక వీటికి టెండర్లు నిర్వహించడమే మిగిలి ఉంది.