AP CM Chandrababu to Meet TG CM Revanth Reddy on July 06 :తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య ఈ నెల 6న సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అయితే ఈ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అలాగే ఇతర ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. సహచర మంత్రులు, ఉన్నతాధికారులతోనూ సీఎం చర్చించనున్నారు.
ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు కావడంతో హైదరాబాద్లోని ఆస్తులు, ఇతర పెండింగ్ అంశాలపై లోక్సభ ఎన్నికల ముందే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలను గతంలోనే కేబినెట్ సమావేశం ఎజెండాలో పొందుపరిచింది. అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో ఈ విషయాన్ని పక్కన పెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో ఈనెల 6న చర్చించాల్సిన అంశాలపై ఎజెండాను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థి సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేడ్కర్, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా రెండు రాష్ట్రాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.