AP CM Chandrababu on TTD Laddu Issue : తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి వాడి ప్రజల మనోభావాలు దెబ్బతీశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యితో ఇష్టానుసారం క్షమించరాని నేరం చేస్తే వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
గత పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బ తీశారని ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదానికి నాసిరకం నెయ్యి వాడారని మరోసారి స్పష్టం చేశారు. రూ.320కే తక్కువ ధరకు వస్తుందని కల్తీ నెయ్యి వాడారని విమర్శించారు. కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా అంటూ నిలదీశారు. తాను తప్పు చేయలేదు టెండర్ పిలిచానని జగన్ చెబుతున్నారని, రూ.320కే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం ఆలోచించవద్దా అంటూ ప్రశ్నించారు.
లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాల వాడకంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ : ఏపీలోని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.