CM Revanth On Palamuru Irrigation Projects : సాగు నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలనీ, వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన అందరి మీద ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు.
దేవాలయాలకు నిధులతో పాటు, ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు జిల్లాలో పసిడి పంటలు పండాలని, పచ్చని పైరులతో ఈ జిల్లా విలసిల్లాలని ఆకాక్షించారు. అందుకు అనుగుణంగా జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. అదేవిధంగా ఎత్తైన ప్రాంతమైన మక్తల్ దగ్గర కృష్ణమ్మ ప్రవహిస్తున్నా, సాగు నీరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే మక్తల్, నారాయణపేట, కొడంగల్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేశామని, టెండర్లు సైతం పూర్తవడంతో తొందర్లోనే పనులు ప్రారంభించకపోతున్నామన్నారు.
మా పాలనలోనైనా పాలమూరును అభివృద్ధి చేసుకోనివ్వండి : పాలమూరు జిల్లా సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిధుల కేటాయిస్తుంటే, కొంతమంది దుర్మార్గులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆరు, ఏడు దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ప్రాంతంలో వలసలు ఆపాలని చేస్తున్న భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని వివిధ రకాల ఆరోపణలు చేసి చిల్లరమల్లర రాజకీయాలకు తెర లేపాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర తనను క్షమించదని, దయచేసి తమ జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండన్నారు. నిధుల కేటాయింపు విషయంలో అడ్డు పడితే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.
"గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఉమ్మడి పాలమూరు వలసల జిల్లాగా మారింది. పాలమూరులోని దేవాలయాల అభివృద్ధితో పాటు, ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను పచ్చగా మారుస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు నిరంతరం కృషి చేస్తాను. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరందిస్తాం. పాలమూరు అభివృద్ధిని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పాలమూరు బిడ్డగా పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటా."- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
"ప్రధాని అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే - మేం నిజాలు చెబుతూనే ఉంటాం"
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం - జనవరి తొలివారం నుంచి పాదయాత్ర : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి