Worldwide New Year Celebrations 2025 : ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సందడి మొదలైంది. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే పసిఫిక్ మహా సముద్రంలోని కిరిబాటి దీవుల్లోని ప్రజలు అందరికంటే ముందే (3.30PM IST) నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన చాతమ్ ఐలాండ్స్ (3.45PM IST) 2025లోకి ఎంటర్ అయింది.
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో ప్రజలు 2024కు వీడ్కోలు పలికి 2025కు ఆనందోత్సహాలతో ఆహ్వానం పలికారు. ఆ నగరంలోని ప్రఖ్యాత స్కైటవర్ వద్ద జరుగుతున్న వేడుకలకు ప్రజలతో పాటు పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్ డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణసంచా వెలుగులతో స్కైటవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన లేజర్, ఫైర్‌వర్క్ షోలు కూడా ఆకట్టుకుంటున్నాయి.
ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు సాయంత్రం ఆరున్నర గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరుగుతున్న వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్ డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్ కు సమీపంలోని వంతెనపై బాణసంచా రివ్వున ఎగిసింది.