Stock Market Investment Tips : స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అయితే సరైన అవగాహనతో, పక్కా వ్యూహంతో పెట్టుబడి పెడితే కచ్చితంగా లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. వీటి గురించి కచ్చితమైన అవగాహన ఉండాలి. అప్పుడే వీటిలో పెట్టుబడులు పెట్టి, మీ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకోగలరు. అందుకే వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
డైవర్సిఫికేషన్
స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్లను కంపెనీల పరిమాణం, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా వర్గీకరిస్తారు.
- భారీ పెట్టుబడితో, పెద్ద స్థాయిలో వ్యాపారం చేసే కంపెనీ స్టాక్లను లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు. ఇలాంటి కంపెనీలు ఎలాంటి ఒడుదొడుకులు వచ్చినా, తట్టుకొని నిలబడగలుగుతాయి. పెట్టుబడిదారులకు దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి.
- స్మాల్ క్యాప్ కంపెనీలకు భారీ పెట్టుబడులు ఉండవు. అలాగే వాటి వ్యాపార పరిధి కూడా తక్కువగానే ఉంటుంది. కనుక మార్కెట్ ఒడుదొడుకులను ఇవి తట్టుకోలేవు. కానీ అన్నీ కలిసి వస్తే, ఇవి పెట్టుబడిదారులకు భారీ లాభాలను ఆర్జించిపెట్టగలవు.
- మిడ్ క్యాప్ కంపెనీల పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. మిడ్ క్యాప్ కంపెనీలకు భారీ పెట్టుబడుల మద్దతు ఉండదు. కానీ చిన్నపాటి మార్కెట్ అస్థిరతలను ఇవి కొంత వరకు తట్టుకోగలవు. అదే సమయంలో ఇవి మంచి గ్రోత్ పొటెన్షియాలిటీని కలిగి ఉంటాయి.
- కనుక పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసుకోవాలి. అంటే తమ పోర్ట్‌ఫోలియోలో తగు నిష్పత్తిలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను చేర్చుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గుతుంది. దీర్ఘకాలంలో మంచి రాబడులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.
గ్రోత్ ఆపర్చూనిటీస్
- స్మాల్ క్యాప్ కంపెనీలకు వృద్ధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా ప్రారంభించిన కంపెనీలు, బిజినెస్‌లు, స్టార్టప్‌లకు మంచి గ్రోత్ పొటెన్సియాలిటీ ఉంటుంది. కనుక పెట్టుబడిదారులకు భారీ లాభాలు వచ్చే అవకాశముంది. అయితే వీటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువగా ఉంటుంది. కనుక మార్కెట్ ఒడుదొడుకులను ఇవి తట్టుకోలేకపోవచ్చు. ఇది పెట్టుబడిదారులకు కాస్త రిస్క్ అనే చెప్పవచ్చు.
- లార్జ్ క్యాప్ కంపెనీల వద్ద భారీ స్థాయిలో మూలధనం ఉంటుంది. కనుక మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకుని ఇవి నిలబడగలుగుతాయి. కనుక పెట్టుబడిదారులకు నష్టభయం తక్కువగా ఉంటుంది. పైగా దీర్ఘకాలంలో మంచి రాబడులు సంపాదించే అవకాశముంటుంది.
- మిడ్ క్యాప్ కంపెనీ పరిస్థితి కాస్త మధ్యస్థంగా ఉంటుంది. దీనిలో రిస్క్, రివార్డ్ రెండూ సమాన స్థాయిలో ఉంటాయి. కనుక మీ పోర్ట్‌ఫోలియోలో ఈ మూడు కేటగిరీల స్టాక్లను తగు నిష్పత్తిలో చేర్చుకోవడం మంచిది.
ఎకనామిక్ ట్రెండ్స్
- మార్కెట్ ట్రెండ్స్, సెక్టోరల్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ప్రతిస్పందిస్తూ ఉంటాయి.
- ఎమర్జింగ్ సెక్టార్స్‌లోని స్మాల్ క్యాప్ కంపెనీలు బాగా అభివృద్ధి చెందుతాయి. మార్కెట్ ట్రెండ్ కూడా వీటికి అనుగుణంగా ఉంటే ఇక చెప్పాల్సిన పనే లేదు.
- లార్జ్ క్యాప్ కంపెనీల విషయానికి వస్తే, ఇవి ఆర్థిక మాంద్యం లాంటి తీవ్రమైన పరిస్థితుల్లోనూ తట్టుకుని నిలబడగలుగుతాయి.
- బాగా విస్తరిస్తున్న రంగాల్లో ఉన్న మిడ్ క్యాప్ కంపెనీలు తక్కువ కాలంలోనే మంచి రాబడులను అందించగలుగుతాయి.
- కనుక పెట్టుబడిదారులు మార్కెట్ తీరుతెన్నులను, దేశ ఆర్థిక పరిస్థితులను, భిన్న రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమగ్రంగా పరిశీలిస్తూ ఉండాలి.
లిక్విడిటీ
పెట్టుబడిదారులు తమ భవిష్యత్ అవసరాల కోసం డబ్బులను మదుపు చేస్తూ ఉంటారు. తీరా అవసరం వచ్చినప్పుడు డబ్బులు చేతికి అందకపోతే, అది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే పెట్టుబడుల విషయంలో లిక్విడిటీ గురించి కూడా కచ్చితంగా ఆలోచించాలి. సింపుల్‌గా చెప్పాలంటే, మన పెట్టుబడులను, రాబడులను డబ్బు రూపంలోకి మార్చుకోగలగాలి.
- స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ షేర్లు భారీ ఎత్తున ట్రేడ్ అవుతుంటాయి. కనుక మీ షేర్లను చాలా సులువుగా అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు.
- కానీ స్మాల్ క్యాప్ షేర్ల విషయంలో అలా ఉండదు. స్మాల్ క్యాప్ షేర్ల డ్రేటింగ్ చాలా తక్కువ పరిమాణంలో జరుగుతుంటుంది. కనుక వెంటనే వాటిని అమ్మేసి సొమ్ము చేసుకోవడం కష్టమవుతుంది. ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి.
- మిడ్ క్యాప్ స్టాక్స్ విషయంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. మార్కెట్ ట్రెండ్ బాగున్నప్పుడు మిడ్ క్యాప్ షేర్లను ఈజీగా అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు. ఒక వేళ మార్కెట్ ఒడుదొడుకుల్లో ఉంటే మిడ్ క్యాప్ షేర్లను అమ్మడం కష్టమవుతుంది. అంటే లిక్విడిటీ సమస్య ఎదురవుతుంది.
- కనుక పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో వీటన్నింటికీ తగినంత స్థాయిలో చోటుకల్పించుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గుతుంది. మంచి లాభాలు సంపాదించే వీలు కలుగుతుంది.
భారీ లాభాలు ఇచ్చే పెన్నీ స్టాక్స్‌ను ఎంచుకోవాలా? ఈ బెస్ట్ టిప్స్ మీ కోసమే!
వారెన్ బఫెట్ చెప్పిన ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు - స్టాక్ మార్కెట్లో లాభాలు గ్యారెంటీ!