Onion Podi Uthappam Recipe : చాలా మందికి ఇష్టమైన టిఫెన్లలో ఊతప్పం కూడా ఒకటి. వేడివేడిగా క్రిస్పీగా ఉండే ఊతప్పం.. పల్లీ చట్నీ, అల్లం చట్నీతో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. అయితే.. ఊతప్పంపై మామూలుగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి చేస్తుంటారు. వీటితో పాటుగా కాస్త పప్పుల పొడి కూడా వేస్తే రుచి ఇంకా బాగుంటుంది. మరి టేస్టీగా పప్పుల పొడితో ఊతప్పం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
ఊతప్పం పిండి కోసం..
- మినపప్పు-కప్పు
- బియ్యం- రెండున్నర కప్పులు
- మెంతులు- టీస్పూన్
- అరకప్పు-పోహా అటుకులు
- ఉప్పు-రుచికి సరిపడా
- వంటసోడా- రెండు చిటికెలు
- ఉల్లిపాయ ముక్కలు
- పచ్చిమిర్చి ముక్కలు
- క్యారెట్ తురుము
- కొత్తిమీర తురుము
పప్పుల పొడి కోసం..
- శనగపప్పు- పావుకప్పు
- మినపప్పు- 2 టేబుల్‌స్పూన్లు
- మిరియాలు -టీస్పూన్
- కరివేపాకు-2
- వెల్లుల్లి రెబ్బలు -10
- ఎండుమిర్చి-15
- నల్ల నువ్వులు-టీస్పూన్
- ఇంగువ - రెండు చిటికెలు
- ఉప్పు-రుచికి సరిపడా
తయారీ విధానం..
- ముందుగా ఊతప్పం పిండి కోసం.. నాలుగు గంటలపాటు బియ్యం, మినపప్పు నానబెట్టుకోవాలి. అలాగే అరగంట సేపు మెంతులు నానబెట్టుకోవాలి. అటుకుల్ని నీళ్లలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు వీటిని మిక్సీలో వేయాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ.. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని 12 గంటలపాటు పులియబెట్టాలి.
- తర్వాత పప్పుల పొడి కోసం.. స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు వేయండి.
- కరివేపాకు దోరగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్‌లో గరిటెతో కలుపుతూ వేయించండి. తర్వాత ఎండుమిర్చి, నల్ల నువ్వులు, ఇంగువ వేసి ఫ్రై చేయండి.
- ఎండుమిర్చి దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి.
- ఇందులో రుచికి సరిపడా ఉప్పు కలిపి.. తర్వాత మిక్సీలో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి.
- మరుసటి రోజు మీరు ఊతప్పం చేయడానికి కావాల్సినంత పిండిని మరొక గిన్నెలోకి తీసుకోండి. (మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి.)
- ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, చిన్న గిన్నెలో వంటసోడా కరిగించి వేసుకోండి.
- పిండిలో సరిపడా నీళ్లు పోసి గరిటెతో బాగా కలపండి. (పిండి కాస్త పల్చగా ఉండాలి.)
- ఇప్పుడు స్టౌపై దోశల పెనం పెట్టి కాస్త ఆయిల్ వేయండి. పెనంపై గరిటె పిండి వేసి అలా వదిలేయండి. పైన కొన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, టేబుల్‌స్పూన్ పప్పుల పొడి వేయండి. ఊతప్పం అంచుల వెంట నూనె వేయండి.
- పెనంపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఊతప్పం 5 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత ఊతప్పం మరో వైపు తిప్పి పైన కొద్దిగా ఆయిల్ వేయండి.
- రెండు వైపులా ఊతప్పం క్రిస్పీగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
- మిగిలిన పిండితో ఇలానే ఊతప్పం చేసుకుంటే సరిపోతుంది.
- ఊతప్పం ఈ విధంగా పప్పుల పొడితో చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి.
పప్పు రుబ్బకుండా 5 నిమిషాల్లో నోరూరించే 'బ్రెడ్ ఊతప్పం' చేసుకోండిలా! - దోశను మించిన టేస్ట్!!
హోటల్ స్టైల్ "దహీ వడ" - ఇంట్లోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అద్దిరిపోతుంది!