Minister Ponguleti about Gold to Kalyana Lakshmi Beneficiaries : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం తప్పకుండా ఇస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో 61 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రూ.7.19 లక్షల కోట్ల అప్పులు చేసిందని, వాటిని తీర్చుకుంటూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో కొంత జాప్యం జరుగుతోంది తప్ప, ఇచ్చిన హామీపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
డిసెంబరులో మరో రూ.13 వేల కోట్ల రుణమాఫీ : సన్నబియ్యం సాగు చేసిన రైతులకు బోనస్‌గా క్వింటాకు రూ.500 ఇస్తామన్న హామీ కూడా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని, డిసెంబర్ నాటికి మరో రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు 56 వేల ఉద్యోగాలిచ్చామని, రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులకు వచ్చే నెలలోనే ఉద్యోగాలిస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులను గ్రామ కమిటీ సమక్షంలో మొదటిగా పేద వారికి మంచి చేకూరేలా వారిని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు.
తాము చెప్పిన విధంగా 4 విడతలుగా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదవాళ్లకు మంచి జరిగే విషయంలో, దేశంలో ఎక్కడా చేయని విధంగా 20 లక్షల ఇళ్ల నిర్మాణాలను ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, తహసీల్దార్ కరుణశ్రీ పాల్గొన్నారు. ఇటీవల వరదల్లో ప్రాణులు కోల్పోయిన షేక్ యాకుబ్, సైదాబీల కుమారులు షరీఫ్, యూసుబ్‌లకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు.
తప్పు చేసిన వారిపై త్వరలోనే ఆటం బాంబులు పేలతాయ్! : మంత్రి పొంగులేటి