Amit Shah Public Meeting in LB Stadium :తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్ స్థాయి(Booth Level) అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా, ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో బీజేపీకి 12 కంటే ఎక్కువ స్థానాలు రావడం ఖాయం : అమిత్‌షా
కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయమని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు వారసత్వ పార్టీలేనని దుయ్యబట్టారు. మోదీని(PM Modi) మూడోసారి ప్రధానిగా చేద్దామని, 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామని అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడికెళ్లినా, మోదీ నామస్మరణే మార్మోగుతుందని అమిత్ షా అన్నారు.
Amit Shah Fires on Opposing Parties :తెలంగాణ ప్రజలు బీజేపీ 12కు తగ్గకుండా ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటేనని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. మజ్లిస్ అజెండాతోనే హస్తం, గులాబీ పార్టీలు పనిచేస్తాయని విమర్శించారు. ఈ మూడు పార్టీలు కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తాయని, తమ వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. సభానంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని(Charminar Bhagyalakshmi Temple) అమిత్ షా దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత పాల్గొన్నారు.