Allu Arjun Interrogation Completed in Chikkadpally Police Station :హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటలకు పైగా విచారణ సాగింది. విచారణ అనంతరం ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు సోమవారం నోటీసులివ్వగా, లీగల్ టీంతో చర్చించిన అనంతరం విచారణ కోసం మంగళవారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత బన్నీ వాసు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. న్యాయవాదులతో కలిసి హాజరైన అల్లు అర్జున్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ విచారించారు. ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో విచారణ జరిగింది.
సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు ఇప్పటికే ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్‌లో ప్రస్తావించిన అంశాలపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో జరిగిన రోజు పరిణామాల ఆధారంగా పోలీసులు ప్రశ్నించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద ఉన్న సాక్ష్యుల నుంచి వివరాలు సేకరించారు. దీని ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
థియేటర్ యజమాన్యం నుంచి సమాచారం అందిందా ? :సంధ్య థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును ఇప్పటికే రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివరాలు రాబట్టారు. పుష్ప-2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు సంబంధించిన అనుమతిని పోలీసులు తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా ? లేదా అనే విషయంపైనా అల్లు అర్జున్‌ను నుంచి స్పష్టత తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్ యజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా? అందినప్పటికీ మీరు ప్రిమియర్‌షోకు వచ్చారా? అనే విషయంపైనా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.