AsaduddinOwaisi on One Day One Election :జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రి వర్గం ఆమోదించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం, రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించింది. అనంతరం జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్టవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జమిలి ఎన్నికల ఆమోదంపై ఎక్స్ వేదికగా స్పందించారు.
తాను ఒకే దేశం ఒకే ఎన్నికలను స్థిరంగా వ్యతిరేకించానని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎందుకంటే ఇది సమస్య కోసం ఒక పరిష్కారమని, ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి షాకు తప్ప ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని స్పష్టం చేశారు. ఈ అంశం పురపాలక సంఘం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని ధ్వజమెత్తారు. జమిలి ఎన్నికలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం నేపథ్యంలో దేశానికి ఏకకాల ఎన్నికలు అవసరం కాదని తేల్చిచెప్పారు. తరచుగా ఆవర్తన ఎన్నికలు ప్రజాస్వామ్య జవాబు దారీతనాన్ని మెరుగుపరుస్తాయని ఒవైసీ పేర్కొన్నారు.