Minister Tummala on 2nd Phase Crop Loan Waiver : రాష్ట్రంలో రెండో విడత పంట రుణమాఫీ సాధ్యమైనంత త్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ 2024లో మొదటి విడతలో లక్ష రూపాయలు లోపు రుణాలకు సంబంధించి వరకు 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు.
ఈ మేరకు 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ.454.49 కోట్లు మాఫీ అయ్యాయని, జిల్లాలోని 78,463 కుటుంబాలకు చెందిన 83,124 మంది రైతులకు రూ.లక్షలోపు రుణం మాఫీ అయినట్లు తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అతి తక్కువగా 2,667 ఫ్యామిలీలకు చెందిన 2,781 మంది రైతులకు రూ.12.53 కోట్లు మాఫీ అయిందని తెలిపారు.
త్వరలో సాంకేతిక సమస్యలు పరిష్కరించి నిధులు జమ చేస్తాం : వీటిలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి అందిన సమాచారం మేరకు 11.32 లక్షల కుటుంబాలకు రూ.6014 కోట్లు ఇప్పటికే జమ కావడం జరిగిందని చెప్పారు. అలాగే, కొన్ని సాంకేతిక కారణాల రీత్యా 17,877 బ్యాంకు ఖాతాలకు చెందిన 84.94 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ కాలేదని అన్నారు. ఆర్‌బీఐ సూచించిన వివరాల ప్రకారం ఆ రైతుల ఖాతాల్లో పేర్కొన్న సాంకేతిక సమస్యలు సత్వరం సరిచేసి, ఆర్‌బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా ఖాతాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.