Minister Thummala Inaugurated Global Rice Summit :తెలంగాణ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇటీవలే దశాబ్ది ఉత్సవాలను జరుపుకున్న రాష్ట్రంలో రైస్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని దీనికి ప్రభుత్వం చేయూతనిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన గ్లోబల్ రైస్ సమ్మిట్-2024లో ఆయన పాల్గొని మాట్లాడారు.
Global Rice Summit 2024 in Hyderabad : అంతకుముంమదు గ్లోబల్ రైస్ సమ్మిట్-2024ను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రాష్ట్రంలో క్రమంగా ధాన్యం ఉత్పత్తి పెరుగుతోందని, 1.2 కోట్ల ఎకరాల్లో ఉత్పత్తి జరుగుతోందని మంత్రి తుమ్మల తెలిపారు. గతేడాది 26 మిలియన్ టన్నుల ధాన్యాన్ని పండిచినట్లు చెప్పారు. ప్రపంచ బియ్యం భాండాగారంగా దేశం అవతరించిందని ఆయన పేర్కొన్నారు.
"రాష్ట్రంలో దాదాపు 220 రకాల ధాన్యం ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణ సోనా రకం బియ్యం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందింది. ధాన్యం ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తోంది. వరికి లోకల్, గ్లోబల్ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారుగా భారత్ ఉంది. ధాన్యం ఎగుమతుల్లో భారత్‌కు 45 శాతం మార్కెట్ షేర్ ఉంది. వందకు పైగా దేశాలకు భారత్ నుంచి ధాన్యం ఎగుమతి అవుతుంది. ఈ సదస్సు ఎగుమతులకు విస్తృతమైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రపంచస్థాయిలోని కీలకమైన వర్తకులతో స్థానిక వ్యాపారులు కలిసిపని చేసే వేదికగా ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నాను." - తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి
వ్యవసాయానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాం : రాష్ట్రంలో రైతు అనుకూల కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తమ సర్కార్ వ్యవసాయానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందని చెప్పారు. అన్నదాతలు పండించిన ధాన్యాన్ని సర్కార్ కనీస మద్దతు ధరకు సేకరిస్తోందని పేర్కొన్నారు. వివిధ పథకాల కింద పౌష్టికాహారం పొర్టిఫికేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామని వివరించారు. ఇక్కడ 3,000ల అత్యాధునిక రైస్ మిల్లులు ఉన్నాయని అన్నారు. నీటిపారుదల వనరులు పెరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణ వరి ఉత్పత్తి థాయ్‌లాండ్‌తో సమానమని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.