Cotton Crop Cultivation In Telangana : ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సందడి మొదలైంది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ముందస్తుగా వచ్చేస్తున్నాయన్న భారత వాతావరణ కేంద్రం అంచనాల నేపథ్యంలో ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కోటి 34 లక్షల ఎకరాల విస్తీర్ణం పైగా భూముల్లో వ్యవసాయ పంటలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈసారి అనూహ్యంగా 60.53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసింది.
ఈ క్రమంలో రైతులకు వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ అనుభవాలు పరిశీలిస్తే సాధారణ సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తే సగటున ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి రాగా అదే హైడెన్సిటీ కాటన్ సాగు చేస్తే 12 క్వింటాళ్ల దిగుబడి లభించినట్లు నిరూపితమైంది. ఈ విధానంలో కాస్త పెట్టుబడి ఎక్కువైనా దిగుబడులు అధికంగా లభిస్తాయని నిపుణులు తెలిపారు.
Govt Focus On Cotton Crop : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌పై ప్రత్యేక దృష్టి సారించిన సర్కారు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. పెట్టుబడి అధికమైనా మంచి దిగుబడులు వస్తే రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న దృష్ట్యా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం విధానం పేరిట ప్రత్యేక ప్రాజెక్టు అమలు చేస్తోంది. ఏపీ, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసీఏఆర్ అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించింది.