Innovation Day 24 Celebrations In Hyderabad : ఆలోచనలు పదును పెట్టి సమాజంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించడమే అసలైన ఇంజినీరింగ్ విద్య అంటున్నారు ఈ విద్యార్థులు. కళాశాలు ఇచ్చిన ప్రోత్సాహంతో సృజనాత్మకతను వెలికితీసి పరిశోధన, ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఆధునాతన సాంకేతికతను వినియోగించి ఔరా అనిపించేలా ఆవిష్కరణలు రూపొందించారు ఈ ఔత్సాహికులు
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదారాబాద్‌లో ఇన్నోవేషన్ డే-24 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఔత్సాహిక ఆవిష్కర్తలు హాజరు అయ్యారు. వీళ్లు రూపొందించిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. సరికొత్తగా నిర‌్వహించిన ఈ కార్యక్రమం ఆసాంతం ఆలోపించజేసేలా, ఆసక్తికరంగా సాగింది. ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు ఈ యువత.
తక్కువ ధరలో మన్నికైన ఇంటి నిర్మాణం :ఇన్నోవేషన్ డే-24 కార్యక్రమం చాలా ఆవిష్కరణలు మనల్ని ఆలోచింపజేశాయి. అందులో పీహెచ్‌డీ విద్యార్థులు రూపొందించిన తక్కువ బరువు ఉన్న కాంక్రిట్ పేదవాడికి ఉపయుక్తంగా ఉంటుంది.ఈ ఆవిష్కరణతో సొంతింటి కలను తక్కువ ఖర్చుతో మన్నికగా నిర్మించుకోవచ్చని ఐఐటీ హైదారాబాద్ పీహెచ్‌డీ స్కాలర్ వీరేంద్ర చెబుతున్నాడు. భారత సైన్యానికి తమ వంతు సాయం అందించాలన్న ధృడ సంకల్పంతో వినూత్నంగా ముందుకు వచ్చింది హైదరాబాద్‌కు చెందిన డిఫెన్స్ కంపెనీ. సరికొత్త టెక్నాలజీతో సరిహద్దుల్లో పహారా కాసే డ్రోన్స్ తయారు చేసింది. అండర్ గ్రౌండ్‌లో దాక్కుని ఉన్న ఉగ్రమూకలను మట్టు పెట్టడాని సిద్ధం చేశారు. అలాగే తీవ్రవాదుల ఆనవాళ్లు కనుగొనడానికి ప్రత్యేక గ్రౌండ్ రోబోట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కంపెనీ.
దేశ రక్షణకు అవసరమైన ఆవిష్కరణలు :సాధారణంగా బులెట్ ప్రూఫ్ జాకెట్లను చూశాం. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పడు కొంత మేరకు తట్టుకోగలిగిన జాకెట్లను చూశాం. కానీ ఇక్కడ మనం చూస్తున్న జాకెట్ ఏకంగా 200 నుంచి 1200 డిగ్రీ వేడిని కూడా తట్టుకోగలుగుతుంది. సముద్రం నడిబొడ్డున నేవీ సైన్యం పోరాడే సమయాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే తట్టుకునే విధంగా తయారు చేశామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.