Adulterated Food Making in Hyderabad : ప్రస్తుతం జనాలు అంతా బిజీబిజీ లైఫ్‌ను గడుపుతున్నారు. ఈ క్రమంలో ఏదైనా పనిని చేయాలనుకుంటే టైం సరిపోదని చెప్పి, కొన్నిసార్లు ఆహారాన్ని కూడా బయటే తినేస్తున్నారు. ఇలా బయట ఫాస్ట్ ఫుడ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు బండ్ల వద్ద ఏ టైంలో చూసినా రద్దీగానే ఉంటుంది. కొన్నిసార్లు ఏంటి జనాలు ఇంటి దగ్గర వండుకోవడం మానేశారా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. అయితే ఇలా బయట బిర్యానీ, ఫ్రైలు అంటూ బాగానే తింటున్నారు. కానీ అవి వేటితో తయారు చేస్తారు? రుచికి ఏం కలుపుతున్నారు? ఇంతకీ అవి తాజావేనా అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? మనం ఆర్డర్ చేయగానే వచ్చేస్తున్నాయి. రుచిగా ఉంటున్నాయని తినేస్తున్నాం. కానీ అవి వేటితో తయారు చేస్తున్నారో తెలిస్తే దెబ్బకు అటువైపు వెళ్లడమే మానేస్తారు.
నగరంలోని బస్తీలు, శివారు ప్రాంతాల్లో ఆహార కల్తీ విచ్చలవిడిగా సాగుతోంది. చిన్న రేకుల షెడ్లు ఏర్పాటు చేసి, బట్టీలు వేసి నాసిరకం తిను బండారాలను భారీగా తయారు చేస్తున్నారు. వీటిని ఇష్టం వచ్చిన పేర్లతో ప్యాకింగ్ చేసి, జనాలకు విక్రయిస్తున్నారు. ఇలాంటి విక్రయాలు ఎక్కువగా పేదలు, మధ్య తరగతి ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇటీవల చింతలబస్తీలోని ఓ ఇంట్లో తయారైన మోమోస్ తిన్న మహిళ ఏకంగా ప్రాణాలనే విడిచింది. మరో 60 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ దృశ్యాన్ని చూస్తే తెలిసిపోతుంది పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయోనని.
ఇవే కాకుండా ఇలాంటి ఘటనలు ఇంకా చాలానే ఉన్నాయి. 10 నెలల క్రితం అల్వాల్‌లోని ఓ హోటల్లో షవర్మా తిన్న వ్యక్తులు నాలుగుసార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీగాళ్లు చిన్న పిల్లలు తాగే పాలను సైతం వదలడం లేదు. పాతబస్తీలో తయారయ్యే కల్తీ పాలు, ఇతర డెయిరీ వస్తువులు తాగి రోగాల బారిన పడుతున్నారు.
పానీపూరి ఇలా తయారు చేస్తున్నారా? : ఆడవాళ్లు ఇష్టంగా తినే పానీపూరి విషయంలోనూ ఎంతో కల్తీ జరుగుతుంది. అవి తయారు చేసే ప్రదేశాలను చూస్తే ఇక లైఫ్‌లో పానీపూరి జోలికి ఎవరూ వెళ్లరు. బోరబండ సైట్-3 నవ భారత్ నగర్లో అల్లాపూర్, పర్వత్‌నగర్ తదితర ప్రాంతాల్లో పానీ పూరీల తయారీ కేంద్రాలు అనేకం. ఇక్కడ ఉపయోగించే నూనె, పిండితో పాటు ఆ వాతావరణం అంతా పూర్తిగా అనారోగ్యకరమే. ఇవి తిని బోరబండ, మాదాపూర్‌లోని బస్తీల్లో తయారయ్యే పానీపూరిలు తినేవారికి విరేచనాలు, వాంతులు సాధారణం అయిపోయాయి. అలాగే నిత్యం వార్తల్లో నగరంలోని ఏదో ఒక మూల బిర్యానీలోనో, కూరల్లోనో కప్పలు, బొద్దింకలు, బల్లులు, ఎలుకలు వచ్చాయంటూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెళుతున్నాయి.