Bicycle Challenge and Events :ఇప్పుడంటే సెల్ఫోన్లు, వీడియో గేమ్‌లు, స్పోర్ట్స్ సైకిళ్లు, బైకులు వచ్చాయి గానీ, 30 నుంచి 40 ఏళ్ల కిందట పిల్లల పరిస్థితి వేరు. గంట, అరగంట పాటు సైకిల్ అద్దెకు తీసుకుని సరదా తీర్చుకునేవారు. సొంతంగా సైకిల్ కొనుక్కోలేని అవకాశాల్లేక అద్దె సైకిళ్లపై ఆధారపడేవారు. కానీ, రోజులు మారిపోయాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సైకిళ్లే కాదు స్పోర్ట్స్ బైకులు, కార్లు కొనిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనూ కొందరు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఒత్తిడిని జయించడానికి, శరీర వ్యాయామం, మైండ్ రీఫ్రెష్మెంట్ దిశగా సైకిల్ తీసుకుని అలా వందల కిలోమీటర్లు వెళ్లిపోతున్నారు. సరదా కోసం సైక్లింగ్ మొదలుపెట్టినవారిలో కొందరు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నారు.
యువతీయువకులే కాదు.. మధ్య వయస్సు, ఏడు పదుల పైబడినవారు సైతం సైకిళ్లపై దూసుకుపోతున్నారు. తామేం తక్కువ కాదంటూ రోజుల తరబడి నిర్వహించే పోటీల్లో మగువలూ పాల్గొని విజేతలుగా నిలుస్తున్నారు. ప్రైజ్‌మనీ లేకున్నా సొంత ఖర్చుతో బెంగళూరు, గోవా, పారిస్, లండన్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు.
సైక్లింగ్ vs రన్నింగ్ - ఈ రెండిట్లో ఫిటినెస్‌కు ఏది మంచిది? - Cycling vs Running For Fitness
రాష్ట్రంలోని పలు నగరాల్లో దాదాపు 250 మంది సైక్లిస్టులు వివిధ క్లబ్బుల్లో సభ్యులుగా ఉన్నారు. పోటీల్లో పాల్గొనాలనే ఉద్దేశం లేకున్నా వ్యాయామం, ఆరోగ్యం, ఆహ్లాదం కోసం వెళ్తున్నారు. అడాక్స్ అనే అంతర్జాతీయ క్లబ్ నిర్వహణ సంస్థ సైక్లింగ్‌లో ప్రతిష్ఠాత్మక పోటీలు నిర్వహిస్తోంది. ఒకే ఏడాది నిర్వహించే 200, 300, 400, 600 కిలో మీటర్ల పోటీల్లో విజేతలను సూపర్ రాండోనీర్ అని పిలుస్తారు. ఈ సూపర్ రాండోనీర్ నాలుగేళ్లకోసారి పారిస్‌లో నిర్వహించే 1,200 కిలో మీటర్ల సైక్లింగ్ పోటీలకు అర్హత సాధిస్తారు. ఈ పోటీని 90 గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. నాలుగేళ్లకోసారి లండన్‌లో 1,500 కి.మీ., బ్యాంకాక్‌లో ప్రతి సంవత్సరం 2వేల కి.మీ. సైక్లింగ్ పోటీలు ఉంటాయి. ఇటలీ టు నార్త్‌కేప్ (నార్వే) వరకు నిర్వహించే సైక్లింగ్ పోటీ యూరప్ ఖండంలోని ఆరు దేశాల మీదుగా సాగుతుంది. 4వేల కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ పోటీని 21 రోజుల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
సామాజిక స్పృహ
గుడివాడలో మూడు సంవత్సరాల కిందట ముగ్గురితో ప్రారంభమైన సైకిల్ క్లబ్ ప్రస్తుతం 60మంది సభ్యులకు చేరింది. ఈ క్లబ్‌లో మహిళలు, 15-65 ఏళ్లవారు కూడా ఉన్నారు రోజూ 40 కి.మీ., వీకెండ్స్‌లో 100 కిలో మీటర్ల రైడ్‌కు వెళ్తున్నారు. అయితే, సైక్లింగ్‌కే పరిమితం కాకుండా గోళీలు, ఏడు పెంకులు(సెవెన్ పిక్స్), కర్ర బిళ్ల, బొంగరాల్లాంటి ఆటలతో బాల్యం అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటడం, మొక్కలను కాపాడిన పాఠశాలలకు పుస్తకాలు, గ్రంథాలయాలూ అందజేస్తూ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. క్లబ్‌లో బ్యాంకు ఉద్యోగులు, వైద్యులు.. యువకులు, చిన్నారులకు ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య జాగ్రత్తలు సూచిస్తున్నారు. అమరావతి రన్నర్స్ క్లబ్ విజయవాడ సైక్లిస్టులు పేద విద్యార్థుల ఫీజులు చెల్లిస్తున్నారు.