Actress Samantha Reacted to Konda Surekha Comments :తమ విడాకుల పట్ల రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత ఘాటుగా స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, వాటి గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని కోరారు. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం కావాలన్నారు. తన ప్రయాణానికి గర్వపడుతున్నానని, దాన్ని చిన్నచూపు చూడవద్దని సమంత పేర్కొన్నారు. మంత్రిగా మాట్లాడే వ్యాఖ్యలకు తీవ్రత ఉంటుందన్న విషయం అర్థం చేసుకొని ఉంటారని ఆశిస్తున్నట్లు సమంత వ్యాఖ్యానించారు.
వ్యక్తిగతంగా ఉన్న విషయాలను తప్పుగా అన్వయించవద్దని కోరారు. ఇద్దరి అంగీకారంతోనే విడాకాలు తీసుకున్నామని, అందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని సమంత స్పష్టం చేశారు. రాజకీయ యుద్ధాల్లో తన పేరును లాగవద్దన్నారు. తాను రాజకీయాలకు ఎప్పుడూ దూరమేనన్న సమంత, అలాగే కొనసాగుతానని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఓ పోస్ట్ పెట్టారు.
‘‘నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను వేడుకుంటున్నా. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’’అని సామ్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.