Allu Arjun will be Release Today : ఈ నెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్, అనంతరం మధ్యంతర బెయిల్‌తో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిక్కడపల్లి పోలీసులు ఆయనను శుక్రవారం మధ్యాహ్నాం అరెస్ట్ చేసి, వాంగ్మూలం, వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించటంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు గేటు వద్ద ఆయన ఏఆర్ సిబ్బందితో గొడవపడినట్టు సమాచారం. జైల్లో ఆయనకు మంజీరా బ్యారక్ కేటాయించారు.
ఇదే బ్యారక్‌లో ఇతర కేసులకు సంబంధించిన ఇద్దరున్నారు. జైలులో కొంత సమయం ముభావంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అల్లు అర్జున్ కుటుంబసభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యజమానులిద్దరికి కూడా మధ్యంతర బెయిలు మంజూరైంది. అర్జున్ 50 వేల వ్యక్తిగత బాండ్‌ను చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, భజన్‌లాల్ కేసులను ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బెయిల్ పత్రాలు రాత్రి 10 గంటలకు తర్వాత చేరటంతో :చిత్ర కథానాయకుడు రాబోతున్నందున తగిన బందోబస్తు కల్పించాలంటూ సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు వినతిపత్రం ఇవ్వడం, దాన్ని ఆమోదిస్తూ పోలీసు అధికారులు స్టాంపు వేసిన విషయాలనూ పరిగణనలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని, అందులో పిటిషనర్లు జోక్యం చేసుకోరాదని, పోలీసులకు సహకరించాలని సూచించారు. అయితే శుక్రవారం రాత్రి 7 నుంచి 9 గంటల్లోపు అల్లు అర్జున్ విడుదల అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు, మామ చంద్రశేఖర్ రెడ్డి జైలు వద్దకు చేరుకున్నారు. ఎస్కార్ట్ సిబ్బందితో చంద్రశేఖర్ రెడ్డి గొడవకు దిగటంతో ఆయనను డబీర్‌పురా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం కొంత సమయానికి జైలు వద్ద వదలి వెళ్లారు. కుమారుడితో కలిసి వెళ్లేందుకు వచ్చిన అల్లు అరవింద్ రాత్రి 10 గంటలకు ఇంటిముఖం పట్టారు. ఏ సమయంలోనైనా ఆయన విడుదల కావచ్చనే సమాచారంతో చంచల్‌గూడ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. బెయిల్‌కు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10 గంటలకు తర్వాత చేరటంతో చంచల్‌గూడ జైల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఆలస్యంగా వచ్చిన బెయిల్ ఉత్తర్వులకు సంబంధించిన విచారణ ఖైదీలను మరుసటి రోజు విడుదల చేయటం ఆనవాయితీ. ఇదే క్రమంలో అల్లు అర్జున్ నేడు విడుదల అయ్యారు. ప్రధాన గేటు ముందు మరోసారి అభిమానులు భారీగా గుమిగూడటంతో జైలు వెనక గేటు నుంచి ఎస్కార్ట్ వాహనంలో నివాసానికి పంపించారు.
ఏ11గా అల్లు అర్జున్ : తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంధ్య థియేటర్ యాజమాన్యం, సిబ్బంది, అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు బీఎన్ఎస్ చట్టంలోని 105, 118 (1) రెడ్‌విత్ 3 (5) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అర్జున్‌ను ఏ11గా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. అయితే అల్లు అర్జున్‌ను అరెస్టు చేసేందుకు గురువారమే ప్రయత్నించినా, ఆయన దిల్లీ వెళ్లినట్లు తెలుసుకుని వెనక్కి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట - 4 వారాల మధ్యంతర బెయిల్