Achampet Govt Hospital problems : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రాంతీయ ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ ఆసుపత్రికి నిత్యం 300 నుంచి 500 మంది రోగులు వచ్చి వెళ్తుంటారు. గతంలో 30 పడకలు ఉండగా, ఉన్నతీకరిస్తూ 100 పడకల ఏరియా ఆసుపత్రిగా మార్చారు. కానీ కావాల్సిన వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వం నియమించలేకపోయింది. రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఆ ఏరియా ఆసుపత్రిని గతేడాది మేలో అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
Govt Hospital Problems : ఆ దవాఖానాకు వెళ్లాలంటేనే జంకుతున్న జనాలు.. వైద్యులదీ అదే పరిస్థితి!
Hospital Problems In Nagarkurnool district :భవన సదుపాయం, వైద్య పరికరాలున్నా,సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది లేరు. వైద్యుల కొరత కారణంగా జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, ప్రసూతి, చిన్న పిల్లలు సహా వివిధ రకాల వైద్య విభాగాల సేవలు అరకొరగా అందుతున్నాయి. ఉన్న సిబ్బందితోనే మెరుగైన సేవలు అందించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.
రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలు ఉన్నా, టెక్నీషియన్లు లేకపోవడంతో కొన్ని రకాల పరీక్షల కోసం రోగుల్ని బయటకు పంపాల్సిన పరిస్థితి. స్కానింగ్ సౌకర్యం ఉన్నా, అందుకు అవసరమైన నిపుణులు లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వైద్యులు గర్భిణీలకు గైనకాలజిస్టులు స్కానింగ్ చేస్తున్నారు. సర్కారీ దవాఖానాకు వచ్చినా ఖర్చు తప్పకపోవడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
''డబ్బులు లేక గవర్నమెంట్ ఆస్పత్రికి వస్తే టెస్టులు చేయడానికి సిబ్బంది లేరని, బయట చేయించుకోవాలని అంటున్నారు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరుగు దొడ్ల తలుపులకు తాళాలు వేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఇక్కడ సమస్యలు పరిష్కరించాలి ''-రోగులు