New Cyber Fraud Alert : దేశంలో ఆన్లైన్ పేమెంట్స్ ఓ రేంజ్లో సాగుతున్నాయి. మారిన ఈ పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కూడా రోజుకో కొత్త పద్ధతిలో మోసాలకు తెరలేపుతున్నారు. అయితే, మోసగాళ్లు ఎక్కడో ఉండి, బ్యాంకు అకౌంట్లోని డబ్బులు మాత్రమే చోరీ చేస్తారనుకుంటే పొరపాటే. వ్యాపారుల ఎదురుగా నిలబడి, వారు చూస్తుండగానే మోసం చేస్తున్నారు! అందుకే, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సౌండ్ బాక్స్ వాడే వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే మీరు మోసపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూసేయండి.
ఈ రోజుల్లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వాడే వ్యాపారులు క్యూఆర్‌కోడ్ స్కానర్లను వాడుతున్నారు. కస్టమర్ కు తమ క్యూఆర్ కోడ్ చూపించి, పేమెంట్ చేయమని అడుగుతున్నారు. వినియోగదారుడు డబ్బులు పే చేయగానే పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్స్‌లు(స్పీకర్స్) వాడుతున్నారు. అయితే, ఒక్కోసారి ఈ సౌండ్ బాక్స్ స్పందించకపోయినా, కస్టమర్ తన ఫోన్‌లోని ట్రాన్సాక్షన్ చూపించడంతో డబ్బు వచ్చేసిందని నమ్మేస్తున్నారు. అయితే, ఇదే అదనుగా భావించిన సైబర్ మోసగాళ్లు నకిలీ యాప్స్‌తో మాయ చేస్తున్నారు.
ఇలాంటి నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? - అయితే అస్సలు లిఫ్ట్ చేయకండి
ఇలా జరిగితే మోసపోయినట్లే!
మోసగాళ్లు తమ వద్ద ఉన్న నకిలీ యాప్‌లతో రద్దీగా ఉన్న దుకాణాల వద్దకు వచ్చి వ్యాపారులను మోసం చేస్తున్నారు. అది ఎలాగంటే, వ్యాపారుల వద్ద తమకు కావాల్సిన సరుకులు కొనుగోలు చేసి, దుకాణదారుడు బిజీగా ఉన్న టైమ్‌లో స్కానర్ ద్వారా డబ్బు పంపామని చెబుతారు. ఆ వెంటనే తన ఫోన్‌లోని నకిలీ యాప్ నుంచి టిక్ మార్క్ చూపించి డబ్బు సెండ్ చేశానని చెప్తున్నారు. అది నమ్మిన వ్యాపారులు "సరే" అనగానే అక్కడి నుంచి జారుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా దుకాణాదారులు కన్ఫర్మేషన్ కోసం తమ ఫోన్ చెక్ చేసుకొని, డబ్బు రాలేదు అని చెప్తే, "రాలేదా?" అంటూ అప్పుడు నగదు పంపిస్తున్నారు.
అప్రమత్తత అవసరం :
చాలా మంది దుకాణాదారులు పేమెంట్ స్పీకర్లను కొన్నాళ్ల తర్వాత పక్కన పెట్టేస్తున్నారు. మరికొందరు అసలు ఈ బాక్సులు తీసుకోవట్లేదు. కస్టమర్ పేమెంట్ అయిపోయిందంటూ తన ఫోన్‌లోని ట్రాన్సాక్షన్ చూపించడంతో డబ్బు వచ్చేసిందని నమ్మేస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఈ తరహా మోసాలు ఎక్కువ అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా, బిజీగా ఉండే దుకాణాల వద్ద ఈ తరహా మోసాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. కాబట్టి, ఈ మోసాల పట్ల దుకాణదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నగదు జమ అయ్యాయా? లేదా అన్నది వెంటనే ఫోన్ ద్వారా సరి చూసుకోవాలని చెబుతున్నారు.
విరాళాలు ఇస్తామంటూ వచ్చే లింకులను నమ్మకండి - ఎందుకో చెప్పిన సైబర్ క్రైమ్ పోలీసులు