తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకున్నారు? - ఫార్ములా ఈ-రేసు కేసులో ఏస్‌నెక్ట్స్‌జెన్‌ను ప్రశ్నించిన ఏసీబీ - FORMULA E RACE CASE IN HYDERABAD

ముగిసిన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధుల ఏసీబీ విచారణ - రెండున్నర గంటలపాటు సాగిన ఇన్వెస్టిగేషన్ - ఫార్ములా ఈ రేసు ఒప్పందం, బ్యాంకు ఖాతాల వివరాలపై ప్రశ్నించిన అధికారులు

FORMULA E RACE CASE IN HYDERABAD
ACE NEXTZEN COMPANY (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2025, 6:55 PM IST

ACB investigates AceNextGen : ఫార్ములా ఈ-రేసు కేసులో మొదట్లో కీలకంగా ఉన్న ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ ఇవాళ హైదరాబాద్‌లో విచారణ చేసింది. ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థ డైరెక్టర్ అనిల్​ను దర్యాప్తు అధికారులు సుమారు రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థనే రేసు నిర్వహించాల్సి ఉండగా కార్ రేస్​కు సంబంధించి అనుమతులు పొందేందుకు సమర్పించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివరాలు గురించి ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.

డైరెక్టర్ అనిల్​ ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థలో మొదటి ప్రమోటర్​గా ఉన్నారు. 9వ సీజన్ రేసు నిర్వహణ అనంతరం ఈ సంస్థ 10వ సీజన్ నిర్వహించాల్సి ఉండగా ఒప్పందం నుంచి తప్పుకుంది. ఇలా ఒప్పందం నుంచి అర్థాంతరంగా వైదొలగడం వెనుక కారణాలపై ఏసీబీ లోతుగా ఆరా తీసింది. 9వ సీజన్ కోసం ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం గురించి పూర్తి వివరాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే ఏ1గా కేటీఆర్, ఏ2 అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్, ఏ3 పూర్వ హెచ్​ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విచారణ చేసింది.

ఒప్పందానికి మధ్యలోనే బ్రేక్ : 2022 అక్టోబరు 25న జరిగిన మొదటి ఒప్పందం ప్రకారం సీజన్‌ 9, 10, 11, 12 రేస్‌ల నిర్వహణ ఖర్చులను ఏస్‌నెక్ట్స్‌జెన్ భరిస్తామని చెప్పింది. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్‌-9 ఫార్ములా ఈ-రేస్‌ జరిగింది. అనంతరం 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్‌-10 రేస్‌ కోసం ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో) సంస్థకు 2023 మే లోనే 50 శాతం సొమ్ము (రూ.90 కోట్లు) చెల్లించాల్సి ఉండగా ఏస్‌నెక్ట్స్‌జెన్‌ కంపెనీ ముందుకు రాలేదు. సీజన్‌-9 ఫార్ములా ఈ-రేసు నిర్వాహణతో తమకు భారీగా నష్టం వాటిల్లిందంటూ ఏస్‌నెక్ట్స్‌జెన్‌ కంపెనీ చేతులెత్తేసింది.

ఈ నిర్ణయంతోనే వివాదం: దాంతో ప్రమోటర్‌గా హెచ్‌ఎండీఏనే(హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ) పోషించాలని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2023 అక్టోబరు 5, 11 తేదీల్లో రూ.45.71 కోట్లను ఎఫ్‌ఈవోకు హెచ్‌ఎండీఏ నేరుగా బదిలీ చేసింది. ఈ వ్యవహారమే ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి తెరలేపింది.

బాధ్యతల నుంచి అకస్మాత్తుగా తప్పుకొన్న ఏస్‌నెక్ట్స్‌జెన్‌ కంపెనీ మీద అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఈ దిశగానే విచారణకు రావాలని ఈనెల 16న నోటీసులు జారీ చేశారు. విచారణకు తాము వస్తున్నట్లు ఏస్‌​నెక్ట్స్‌జెన్ డైరెక్టర్ అనిల్ ముందే సమాచారం ఇచ్చారు. అయితే ప్లైట్ ఆలస్యమైందని ఉదయం సమాచారం ఇచ్చారు. విమానం హైదరాబాద్ చేరుకున్నాక మధ్యాహ్నం 3 గంటల సమయంలో విచారణ ప్రారంభించారు.

ఫార్ములా - ఈ కేసు వ్యవహరంలో ఎస్ నెక్ట్స్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు

నా ఆదేశాలతోనే నిధులు మంజూరు - ఏసీబీ విచారణలో కేటీఆర్ కీలక విషయాలు వెల్లడి

ABOUT THE AUTHOR

...view details