A Young Man From Karimnagar has Secured Five Govt Jobs : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం రావడమే కష్టం. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్లు జిల్లా గ్రంథాలయాన్నే గృహంగా మార్చుకున్నాడు ఆ యువకుడు. ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపిస్తున్నాడు కరీంనగర్ చెందిన రాజశేఖర్ రావు. ఇన్ని ఉద్యోగాలెలా సాధించాడు? ఆ విశేషాలు ఈ కథనంలో చూద్దాం.
ప్రస్తుతం ప్రభుత్వ కొలువు సాధించడమంటే యుద్ధమనే చెప్పాలి. ఎన్నో ఆటంకాలు ఏర్పడినా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమయ్యాడు ఈ యువకుడు. పోటీ పరీక్షలకు చదువుకునేందుకు పుస్తకాలు లేని సమయంలో జిల్లా గ్రాంథాలయాన్నే నివాసంగా చేసుకున్నా డు. పట్టుదలతో చదివి 5సర్కారీ కొలువులు సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు.
కరీంనగర్‌కు చెందిన రాజశేఖర్ రావు ఎంఏ ఇంగ్లీష్, ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీలో 3 పీజీలు పూర్తి చేశాడు. తండ్రి వెంకట మల్లయ్య సాంఘిక సంక్షేమశాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. సోదరుడు ఐలయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జీవితంలో ఎదురైన ప్రతి ఓటమిని గుణపాఠంగా తీసుకుని 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు రాజశేఖర్ రావు.
కృషి ఉంటే ఏ ఉద్యోగమైన సాధించవచ్చు : ప్రభుత్వ ఉద్యోగ సాధనలో సోదరుడు ఐలయ్య తనకు ఆదర్శం అంటున్నాడు రాజశేఖర్ రావు. పోటీ పరీక్షల సన్నద్ధతలో 2ఏళ్లు గ్రంథాలయానికే పరిమితమై కష్టపడి చదివి జేఎల్ కొలువు సాధించిన సోదరుడిని చూసి గర్వంగా ఉందని ఐలయ్య చెబుతున్నాడు. కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి ఉద్యోగమైనా సాధించవచ్చు అంటున్నాడు.