Woman from Mahabubabad Cultivating Mushrooms :చదువుకున్న రంగంలోనే ఉద్యోగం సాధించడం గగనం అవుతోన్న ఈ రోజుల్లో అదే రంగంలో వ్యాపారమంటే మమూలు విషయం కాదు. కానీ, ఈ యువతి తనకున్న జ్ఞానానికి కొంచెం పెట్టుబడిని కలగలిపి పుట్టగొడుగుల వ్యాపారం చేస్తోంది. ఆన్‌లైన్ వేదికగా మహా నగరాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలు అందుకుంటోంది. ఈమె పేరు యామిని. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు స్వస్థలం. బయో కెమిస్ట్రీలో పీజీ చేసింది. ఓ పల్లె దవాఖానాలో విధులు నిర్వర్తిస్తున్న చందుతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. అయితే ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం కాక రోగులకు తన వంతు సాయంగా నిలుస్తూ స్వయం ఉపాధి పొందాలన్నది యామిని కోరిక. అలా పుట్టగొడుగుల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
బయో కెమిస్ట్రీలో పీజీ చేసినప్పుడే పుట్టగొడుల సాగు లక్ష్యంగా పెట్టుకుంది యామిని. మెళుకువలు నేర్చుకోవడానికి బెంగుళూరు ఐఐహెచ్ఐర్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. పైగా ఫైబర్, కాల్షియం వంటి ప్రోటీన్స్ పుట్టగొడుగుల్లో అధికంగా ఉండటంతో వైద్యులు దీన్నే రిఫర్ చేస్తున్నారు. అందుకే ఆరోగ్యకరమైన మిల్కీ మష్రూమ్ వెరైటీ ఏపీకే2 విత్తనాలను తీసుకువచ్చి ఇంట్లోనే సాగు చేస్తున్న అంటోంది యామిని. చదువుకుంటూనే స్వయం ఉపాధిగా పుట్టగొడుగులను పెంచుతోంది. తద్వారా మరికొంత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఉద్యోగం చేస్తూ వేరొకరి కోసం ఇబ్బందులు పడేకంటే, వ్యాపారం చేస్తూ అత్మగౌరవంతో బతకడం మేలంటోంది ఈ ఔత్సాహికురాలు.
వ్యాపారం మెుదలు పెట్టిన తొలినాళ్లలో ఇబ్బందులు :ఇంట్లోనే పుట్టగొడుగులను పెంచడం వల్ల అధిక సమయం కేటాయిస్తున్నామని, అందుకు కుటుంబసభ్యుల సహకారం అందుతోందని చెబుతోంది యామిని. వ్యాపారం మెుదలు పెట్టిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది యామిని. క్రమంగా మెళుకువలు నేర్చుకుని సాగుపై పట్టు సంపాదించింది. మంచి ఆదాయం అందుకుంది. ప్రస్తుతం మిల్కి మష్రూమ్ పుట్టగొడుగులకు మార్కెట్‌లో కిలో400 నుంచి 450 రూపాయల వరకు ధర పలుకుతోందని చెబుతోంది. హైదరాబాద్, బెంగళూరు మహా నగరాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలు పొందుతోంది.