Increase Slots in Post Office Passport Service Centers : రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో (పీఓపీఎస్‌కే) స్లాట్‌లు పెంచేందుకు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి(రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్) అంగీకరించినట్లు రాష్ట్ర చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పాస్‌పోర్టులకు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో స్లాట్ల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా వాటిని పెంచాలని కోరినట్లు వెల్లడించింది.
చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో గురువారం(నవంబర్ 28) జరిగిన సమన్వయ సమావేశంలో చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ పి.వి.ఎస్.రెడ్డి, హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ, యూఐడీఏఐ డైరెక్టర్ ఆర్.వి.ఎం.శ్రీనివాస్, పోస్టల్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీలు, పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు : రాష్ట్రంలో 265 పోస్టాఫీసులు ఆధార్ నమోదు కేంద్రాలుగా ఉన్నాయి. ఐదేళ్ల వయసు వరకు పిల్లల ఆధార్ నమోదు, 5 నుంచి ఏడేళ్లు, 15 నుంచి 17 ఏళ్ల వయసు వారికి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ కవరేజీకి తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై చర్చలు జరిగినట్లు తెలిపారు. ఇందుకోసం పోస్టల్ శాఖ అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పవర్ఫుల్ పాస్‌పోర్ట్ : ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల జాబితాను గతంలో (జూలై 2024) హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది. ఇంటర్నేషనల్ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో భారత్ పాస్‌పోర్ట్ 82వ స్థానంలో నిలిచింది.
ఆ మూడు కేంద్రాల్లో రద్దీ అధికం : పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో హైదరాబాద్‌లోని మూడు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో రద్దీ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాల్లో కూడా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ ఇక్కడే ఓ చిక్కు ఉంది. అది దరఖాస్తు దారులు ఎక్కువగా అమీర్‌పేట, టోలిచౌకి, బేగంపేట కేంద్రాలనే ఎంచుకుంటున్నారు. దీంతో ఈ మూడు కేంద్రాలపై భారం పడుతోంది. కానీ విదేశీ వ్యవహారాల శాఖ ఓ వెసులు బాటును కల్పించింది. అది ఓ రాష్ట్రం వారైనా ఆయా జిల్లాలోనైనా దరఖాస్తుదారులు పాస్ పోర్టు స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.