Eye Sight Increase Exercise: ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ ప్రపంచంలో ఫోన్, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా చిన్న నుంచి పెద్ద వరకు చాలా మందిలో కంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకా ఆలస్యంగా నిద్ర పోవడం, స్క్రీన్ టైమ్ ఎక్కువ కావడం వల్ల కళ్లు పొడిబారడం, నొప్పులు తలెత్తుంటాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ఈజీ యోగా ఆసనాలు చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
త్రటాక: కళ్ల ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ఇచ్చేందుకు పామింగ్ పోస్ అనే త్రటాక ఆసనం బాగా ఉపయోగపడుతుందని Journal of Clinical Ophthalmologyలో తేలింది. Yoga for Eye Health: A Randomized Controlled Trial అనే అధ్యయనంలో బెంగళూరులోని SVYASA University అడిషినల్ ప్రొఫెసర్ కుమార్ ఎన్ పాల్గొన్నారు. ఇంకా కంటి కండరాలపైన ఒత్తిడిని తగ్గిస్తుందని వివరించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఎలా చేయాలి?
ప్రశాంతంగా నేలపై కూర్చోవాలి. ఆ తర్వాత రెండు అర చేతులను వేడిగా అయ్యేవరకు రుద్దుకోవాలి. ఇప్పుడు కళ్లు మూసుకుని రెప్పలపైన మీ చేతులను పెట్టుకోవాలి. ఇప్పుడు ఊపిరి తీసుకుని విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం లేచిన తర్వాత ఇలా తప్పక చేయాలని చెబుతున్నారు. కళ్లు అలసిపోయినా ఇలా చేయొచ్చని చెబుతున్నారు.
చక్రాసనం: కళ్లకు ప్రసరణ సాఫీగా చేసేందుకు చక్రాసనం బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇది కళ్ల కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఏకాగ్రతను పెంచుతుందన్నారు. ప్రశాతంగా కూర్చుని తలను నిటారుగా పెట్టాలి. ఇప్పుడు కళ్లను సవ్య, అపసవ్య దిశల్లో వీలైనన్నిసార్లు తిప్పాలి.
నాసికాగ్ర దృష్టి: దీనినే నోస్ టిప్ గేజింగ్ అని కూడా పిలుస్తుంటారు. ఇందుకోసం ప్రశంతామైన వాతావరణంలో కూర్చుని వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు చేతిని ముందుకు పెట్టి బొటన వేలిని కళ్లకు కొద్ది దూరంలో ఉంచి, కొద్దిసేపు దాన్నే చూడాలి. ఆ తర్వాత వేలిని కుడి, ఎడమ దిశల్లో తిప్పుతూ.. చూపు మాత్రం వేలిమీదే ఉండేలా చూసుకోవాలి. ఇలా కొద్దిసేపు పక్కకు చూసి మళ్లీ కొనసాగించాలని చెబుతున్నారు.
ఉర్ద్వ దృష్టి: ఈ యోగాసనం కళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. కళ్ల నొప్పులకు ఇబ్బందులకు గురయ్యేవారు దీనిని ఎక్కువగా చేయాలని అంటున్నారు. ఇందుకోసం ప్రశాంతంగా కూర్చుని కళ్లను పైకి, కిందకి తిప్పాలి. కొద్దిసేపు విరామం తీసుకొని ఈసారి కిందకి, పైకి చేయాలి. కాస్త విరామమిచ్చి సుమారు 5సార్లు చేయాలి.
భ్రమరి ప్రాణాయామం: బీ బ్రీతింగ్ అని పిలుచుకునే ఈ ఆసనం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. ఇంకా మనసును సైతం ప్రశాంతంగా ఉంచుతుందని వివరించారు. ప్రశాంతంగా కూర్చుని కళ్లు మూసుకుని రెండు చేతుల బొటనవేళ్లను రెండు చెవుల్లో ఉంచాలి. గాలిని లోపలకు పీల్చుకుని తుమ్మెద శబ్దంతో గొంతు ద్వారా బయటకు వదలాలి.
సర్వాంగాసనం: ఈ ఆసనం శరీరం పైభాగానికి, ముఖ్యంగా కళ్లు, తలకు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి సాయపడుతుందని చెబుతున్నారు. కళ్లకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ను అందిస్తుందని వివరించారు. ఇందుకోసం ముందుగా వెల్లకిలా పడుకొవాలి. ఆ తర్వాత మోకాళ్లను లేపి పొట్ట వైపునకు తేవాలి. ఇప్పుడు చేతులను నడుముకు ఆనించి, ఒక్క ఉదుటున తుంటిని పైకి లేపాలి. భుజాలు, మోచేతులు నేలకు ఆనించి కాళ్లను తిన్నగా పైకి చాచాలి. ఇప్పుడు శరీరం తూలిపోకుండా నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. శ్వాసను యథావిధిగా తీసుకుంటూనే కళ్లను మూసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత నెమ్మదిగా మామూలు స్థితికి రావాలని చెబుతున్నారు.
బాలాసనం: ఈ ఆసనం కళ్లకు ఒత్తిడిని తగ్గించి రిలాక్స్ చేస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం మోకాళ్లను నేలకు ఆనించి మడమలపై కూర్చోవాలి. ఇప్పుడు ముందుగు వంగి మీ తలను నేలకు ఆనించి ఊపిరి పీల్చుకోవాలి.
ఇంకా ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నా, కంప్యూటర్ మీద పని చేస్తూ కొన్ని సార్లు రెప్ప వాల్చడం మర్చిపోతుంటాం. ఫలితంగా కళ్లు పొడిబారడం, నొప్పి వస్తుంటాయి. అందుకే గుర్తొచ్చినప్పుడల్లా కనురెప్పల్ని 10, 15 సార్లు వెంటవెంటనే కొట్టాలని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ జుట్టు తెల్లపడుతోందా? ఇలా చేస్తే వెంటనే నల్లగా మారుతాయట!
షుగర్ పేషెంట్స్ రోజుకు ఎంత సేపు వాకింగ్ చేయాలి? వారానికి అంత నడిస్తే సూపర్ బెనిఫిట్స్!