Telangana Highest Ever Power Demand : రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండు ఆకాశాన్ని అంటుతోంది. గతేడాది మార్చి 8న అత్యధిక గరిష్ఠ డిమాండు 15,623 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది గత రెండు రోజుల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ నెల 6వ తేదీన 15,752 మెగావాట్ల డిమాండ్ నమోదవడంతో రాష్ట్ర చరిత్రలోనే నూతన రికార్డుగా డిస్కంలు వెల్లడించాయి. కానీ, 24 గంటల వ్యవధిలోనే కరెంటు వినియోగం అనూహ్యంగా పెరగడంతో శుక్రవారం అత్యధికంగా 15,856 మెగావాట్ల డిమాండుతో సరికొత్త రికార్డు నమోదైనట్లు దక్షిణ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఈటీవీ భారత్‌కు తెలిపారు.
2024 ఫిబ్రవరి 7తో పోలిస్తే ఈ ఏడాది (శుక్రవారం) 11.07% అదనంగా నమోదైందని చెప్పారు. ప్రతి ఏడాది యాసంగి పంటల సాగుకు విద్యుత్ అవసరం పెరిగి, మార్చిలో రోజువారీ డిమాండు అధికంగా నమోదవడం ఆనవాయితీ. ఈ ఏడాది అప్పుడే ఎండల వేడితో ఇళ్లు, పరిశ్రమల్లో వినియోగంతో డిమాండులో కొత్త రికార్డులు నమోదవుతున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ డిస్కం చరిత్రలో తొలిసారి శుక్రవారం 10,130 మెగావాట్ల డిమాండు నమోదైనట్లు ప్రకటించారు.
ప్రజల ముందు నివేదిక : విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కొనుగోలు వ్యయమూ పెరుగుతోందని డిస్కంలు ప్రకటించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)కి సంబంధించి డిస్కంలు సమర్పించిన ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీ తాజాగా ప్రజల ముందుపెట్టింది. నివేదికలోని ప్రతిపాదనలపై మార్చి 19న హనుమకొండలో, 21న హైదరాబాద్‌లోని ఈఆర్సీ కార్యాలయంలో బహిరంగ విచారణ ఉంటుందని, అలాగే ప్రజల అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 28లోగా పంపాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తాజాగా జారీ చేసిన నోటిపికేషన్లో కోరింది. నివేదికలో డిస్కంలు ఏం చెప్పాయంటే
- వచ్చే ఏడాది రాష్ట్రానికి మొత్తం 98,319 మిలియన్ యూనిట్ల(మి.యూ.) కరెంటు అవసరం. కానీ 1.23 లక్షల మి.యూ.లు అందుబాటులో ఉంటాయి.
- రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది(2024-25) సగటున 17% పెరిగింది. పరిశ్రమ(హెచ్‌టీ)ల్లో 24%, ఇళ్లలో 18%, సేద్యంలో 10% చొప్పున సగటున వినియోగం పెరిగింది.
- మొత్తం 98,319 మి.యూ. కరెంటు కొనుగోలుకు రూ.50,572 కోట్లు అవసరం. అంటే ఒక్కో యూనిట్ కొనుగోలుకు సగటు వ్యయం రూ.5.54 అవుతుంది. కొనుగోలుకే కాకుండా సరఫరా, పంపిణీ, ఇతర వ్యయాలకు మరో రూ.15,277 కోట్లు అవసరం. వీటితో కలిపి వచ్చే ఏడాది మొత్తం రూ.65,849 కోట్ల ఖర్చవుతుంది. అప్పుడు ఒక యూనిట్ కరెంటు సరఫరాకు సగటు వ్యయం(ఏసీఎస్) రూ.7.54 అవుతుంది.
- ప్రస్తుత ఛార్జీల ప్రకారం రూ.45,698 కోట్లు మాత్రమే ఆదాయంగా సమకూరుతోంది. ఆదాయ, వ్యయాల మధ్య రూ.20,151 కోట్ల అంతరం ఉంటుంది. దీన్ని ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది.
ఏంటీ ఇది నిజమేనా? - ఒక్క బోరు మోటారు బిల్లే అక్షరాలా రూ.8 లక్షలు!
రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం - పెరుగుతున్న ఎండలే కారణమా?
మీ భూమిలో 'సౌర విద్యుత్'తో కాసులు పండించొచ్చు! - ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి