A Resident of Narayanpet Returned to India From the Russian Military :ఇటీవల కాలంలో విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎక్కువ జీతాలతో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏజెంట్లు అమాయక ప్రజలను నమ్మించి విదేశాల్లో సైబర్ నేరగాళ్లకు, ఇతరులకు అప్పజెప్తున్నారు. అలా మోసపోయిన వారు విదేశాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఒక ఉద్యోగం పేరు చెప్పి, అక్కడ ఇతర పనులు చేయిస్తూ నరకకూపంలోకి నెట్టేస్తున్నారు. అక్కడ వారు ఎవరికి చెప్పుకోవాలో తెలీకా, సెల్ఫీ వీడియోల ద్వారా తమ గోడును వెల్లబోసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితే నారాయణపేట వాసికి ఎదురైంది.
తొమ్మిది నెలలు రష్యా సైన్యంలో నరకం అనుభవించి, వారి నిర్భందంలో ఉన్న నారాయణపేటకు చెందన సోఫియన్ శుక్రవారం రాత్రి నారాయణపేటకు చేరుకున్నాడు. 2021లో దుబాయ్‌లో ఉద్యోగంలో చేరి, అక్కడే జీవనం కొనసాగించే వాడు. 2023లో ఒక ఏజెంట్‌తో పరిచయం ఏర్పడింది. రష్యా దేశంలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఉందని ఆ యువకుడుని నమ్మించాడు. సోఫియన్ 2023 నవంబర్‌లో రష్యా చేరుకున్నాడు. అక్కడ తాను అనుకున్న సెక్యూరిటీ గార్డు ఉద్యోగం లేకపోవడంతో బలవంతంగా ఆర్మీలో చేర్చుకున్నారు. ఇటీవల జరుగుతున్న ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలో ఎన్నోసార్లు ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడాడు.
ఫలించిన చర్చలు : ఏజెంట్ చేతిలో తాను మోసపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. విదేశాంగ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భారత ఎంబసీలకు వివరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ బందీల విడుదలపై రష్యా నాయకులను సంప్రదించారు. ఇవన్నీ ఫలించిన నేపథ్యంలో విడుదలైన సోఫియన్ విమానంలో శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.