A Man Pleads To Reunite Their Family : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం ముత్యాలపాడుకు చెందిన కృష్ణవేణి అనే మహిళ బాతుల పెంపకం కోసం వచ్చింది. మల్లేశం ఇంటి పక్కన అద్దెకు నివాసం ఉండేది. ఈ క్రమంలో మల్లేశం కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగింది. మల్లేష్ భార్య భాగ్య, అతని ఇద్దరి కుమార్తెలతో అనుబంధం పెంచుకుని పూర్తిగా వారిని తన స్వాధీనంలోకి తెచ్చుకుంది.
గత జన్మలో నీ భర్త శివుడు అని చెప్పి నమ్మించి :కొద్ది రోజుల తరువాత తన సొంత గ్రామానికి వెళ్లిన కృష్ణవేణి అంకమ్మ అనే మరో మహిళను వీరికి పరిచయం చేసింది. తరుచూ భాగ్యతో వీరితో ఫోన్లో మట్లాడుతుండేది. కృష్ణవేణి, అంకమ్మలు భాగ్యను మాటలతో ఏమార్చారు. గత జన్మలో నీ భర్త శివుడు, మనమంతా ఇంద్రలోకంలో ఉండే వాళ్లం. మనం అక్కాచెల్లెల్లం అని నమ్మబలికింది. దీంతో భాగ్య తన భర్త, కుమారున్ని వదిలి ఇద్దరు కుమార్తెలను వెంట తీసుకుని కృష్ణవేణి దగ్గరికి వెల్లిపోయింది.
తన కుటుంబం ఛిన్నాభిన్నమైందని భర్త ఆవేదన :కనిపించకుండా పోయిన తన భార్య, కుమార్తెల ఆచూకి కోసం తనకు తెలిసిన ప్రాంతాలన్ని మల్లేశం వెతికాడు. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కృష్ణవేణి ఇంటి దగ్గర వారు ఉన్నట్లు గుర్తించాడు. అక్కడి వెళ్లి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కృష్ణవేణి తనపై దాడి చేసిందని బాధితుడు వాపోయాడు. మరోసారి పోలీసుల సహకారంతో భార్య బిడ్డలను సొంత ఊరికి తీసుకువచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయిందన్నాడు. కృష్ణవేణి కారణంగా తన కుటుంబం ఛిన్నాభిన్నమైపోయిందని మల్లేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.